గుంటూరు జిల్లాలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 436కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో నరసరావుపేటలోని వరువకట్టలో 2, గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీలో 1, దుగ్గిరాల మండలం చింతలపూడిలో ఒక కేసు వెలుగు చూశాయి. వీటితో కలిపి.. గుంటూరులో 179, నరసరావుపేటలో కేసులు 187కు చేరుకున్నాయి.
నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీలో వ్యక్తికి కరోనా ఎలా సోకిందో తేలాల్సి ఉంది. చింతలపూడిలో కొవిడ్ సోకిన వ్యక్తి... ఇటీవలే పెనుమాకలో పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్‌గా అధికారులు తెలిపారు. కొత్త ప్రాంతాల్లో 2 కేసులు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో ఆరా తీస్తున్నారు.