గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒక్కరోజులో 69 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 927కి పెరిగింది. గడచిన మూడు రోజుల్లోనే 139 కేసులు నమోదుకావడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
తాజాగా గుంటూరు నగర పరిధిలో 38, నరసరావుపేటలో కొత్తగా 2 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత రెండు నెలలుగా మాచర్లలో కేసులు లేవు. తాజాగా మూడు పాజిటివ్ కేసులు రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ కేసులు వెలుగుచూసిన 4, 17, 18 వార్డులను కంటైన్మెంట్ జోన్లగా అధికారులు ప్రకటించారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యంత్రాంగం పరీక్షల వేగాన్ని పెంచింది. మరణాల ముప్పులేకుండా 60 ఏళ్లు దాటినవారిపైన.. కంటైన్మెంట్ జోన్లలో కేసుల కట్టడిపైన అధికారులు దృష్టి సారిస్తున్నారు.