ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Free Crop Insurance: గందరగోళంగా పంటల బీమా.. తీరని అన్యాయం జరిగిందంటున్న రైతుల - చాలా పంటలకు నామమాత్రంగానే పరిహారం చెల్లింపులు

Crop Insurance: పత్తికి ఇచ్చిన పరిహారం విత్తనాలకూ చాలని పరిస్థితి నెలకొంది. వేరుసెనగ, పత్తి.. ఇలా వివిధ పంటలకు ఇచ్చిన బీమాతో బస్తా డీపీఏ కూడా రాదు. కొన్ని పంటలకు బీమానే లేదు. ఇలా.. పంటల బీమా పరిహారం అంతా గందరగోళంగా తయారైంది. రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలను ప్రదర్శిస్తామంటున్నా.. బయటపెట్టడం లేదు. రైతులకు సమాధానం కూడా రావట్లేదు. బీమాపై రైతులకు ఎన్నో ఆశలు కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌.. ఆచరణలోకి వచ్చేసరికి చుక్కలు చూపిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 3, 2023, 7:28 AM IST

జగన్‌.. మీరిచ్చే ధీమా ఇదా?

Crop Insurance:అకాల వర్షాలు, కరవు, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో అనేక అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. ఉచిత పంటల బీమా పేరుతో నిలువునా ముంచేశారనే ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌లో వివిధ పంటలు సాగు చేసిన రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వారికి బీమాలో చోటు దక్కలేదు. ఉత్తరాంధ్రలో వర్షాలకు భారీగా నష్టపోయినా.. బీమా పరిహారంలో మొండిచేయి చూపారు. రైతుకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత పంటల బీమా కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. ఆచరణలో మడమతిప్పేశారు.

పంట నష్టపోయిన బీమా ఇవ్వని ప్రభుత్వం:గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో 29.5 శాతం, 21.6 శాతం, విజయనగరం జిల్లాలో 53.9 శాతం, 30.8 శాతం చొప్పున సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. మొక్కజొన్నకు భారీ నష్టం వాటిల్లింది. అయినా రైతులకు బీమా చెల్లింపులో మొండిచేయి చూపారు. శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన ఒక్క రైతుకూ బీమా వర్తింపజేయలేదు. పత్తి దిగుబడి కూడా ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్ల మధ్యనే వచ్చింది. అయినా పరిహారం జాబితాలో పేర్లు లేవు. ఐదేళ్ల దిగుబడి ఆధారంగానే బీమా చెల్లిస్తాం తప్ప.. ఒక్క ఏడాది తగ్గినంత మాత్రాన వర్తించదని.. దిగుబడిలో 50 శాతం తగ్గితేనే హామీ వర్తిస్తుందని కొన్నిచోట్ల అధికారులే చెప్పడంతో నిర్ఘాంతపోవడం రైతుల వంతయింది.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు పంచాయతీలో 401.8 ఎకరాలకు సంబంధించిన 323 మంది రైతులకు 50 లక్షల 13 వేల 171 రూపాయలు విడుదలయ్యాయి. ముంజేరులో 309 మందికి చెందిన 389.4 ఎకరాలకు 48.67 లక్షలు, మధుర గ్రామం జగ్గయ్యపేటలో 14 మందికి చెందిన 11.8 ఎకరాలకు 14.7 లక్షల రూపాయలు విడుదలైనట్లు మండల వ్యవసాయాధికారి తెలిపారు. వరి దిగుబడి శాతం తక్కువగా ఉండటంతో పరిహారం వచ్చిందన్నారు. అయితే పంట నష్టపోయిన అధికశాతం రైతులకు పరిహారమే దక్కలేదు. 6 ఎకరాల వరికి 36 బస్తాలు వచ్చినా బీమా దక్కలేదని భోగాపురం రైతులకు పరిహారమే దక్కలేదు. ఆరెకరాల వరికి 36 బస్తాలు వచ్చినా బీమా దక్కలేదని భోగాపురం మండలం సుందరపేట రైతులు వాపోయారు.

చిత్తూరు జిల్లాలో వాతావరణ ఆధారిత పంట బీమా కింద కేవలం టమాటా, వేరుసెనగకు మాత్రమే పరిహారం వచ్చింది. వేరుసెనగ రైతులకు 9.32 కోట్లు, టమాటాకు 61 లక్షల రూపాయలు మాత్రమే విడుదలైంది. 15 మండలాల్లో వేరుసెనగకు పరిహారం రాకపోగా 16 మండలాల్లో ఒక్కరికీ టమాటాకు పరిహారం అందలేదు. బాపట్ల జిల్లాలో ఎక్కడా జాబితాలు బయటపెట్టడం లేదు. వేటపాలెం మండలం మొత్తంమీద ఒక్క రైతుకు, పర్చూరు మండలం మొత్తం మీద ముగ్గురికి మాత్రమే పరిహారం అందింది. పంటల బీమా పరిహారం వెల్లడించే విషయంలో అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు.

వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలు ప్రదర్శించడం లేదు. వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం ఏటూరు రైతు భరోసా కేంద్రం పరిధిలో క్రమ సంఖ్య మేరకు 372 మందికి 670.39 ఎకరాలకు 62 లక్షల 59 వేల 982 రూపాయల పరిహారం నిర్ణయించారు. అంత విస్తీర్ణంలో బత్తాయి తమ గ్రామంలో లేదని సాగు చేయని భూముల్ని చూపించి కొందరిని పరిహారానికి ఎంపిక చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అటు కంది పంటకూ బీమా మొత్తం నామమాత్రంగానే ఇచ్చారు. వేరుసెనగకు ఎకరాకు కేవలం 11 వందల 6 రూపాయల్ని బీమాగా మంజూరు చేశారు. పత్తి సాగుకు ఎకరాకు 50 వేల రూపాయల పైనే ఖర్చవుతోంది. క్వింటాల్ పత్తి తీస్తే 12 వందల రూపాయల వరకు అవుతంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన బీమా విత్తనాలకూ వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత పంటల బీమాపై మొదట్నుంచీ ప్రభుత్వానిది దాటవేత వైఖరే. బీమా సంస్థల ద్వారా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలు చేస్తున్నారు. వాతావరణ ఆధారిత బీమాను మాత్రమే ప్రభుత్వం సొంతంగా అమలుచేస్తోంది. 17 జిల్లాలకు వాతావరణ బీమా వర్తింపజేసిన అధికారులు 9 జిల్లాలను పక్కకు తప్పించారు. ఉచిత పంటల బీమా పరిహారం అంటూ.. ప్రభుత్వం చెప్పే లెక్కలు చూస్తే విస్తుపోవాల్సిందే. ఒక రైతు పేరుతో 2, 3, 4, సెంట్లు చొప్పున వేర్వేరు ఐడీలు నమోదు చేసి ముగ్గురు రైతులుగా పేర్కొంటోంది. సంఖ్య పెంచేసి గొప్పలు చెబుతోంది. వాస్తవంగా రాష్ట్రంలో 48.94 లక్షల మంది రైతులు ఖరీఫ్‌లో పంటలు సాగు చేశారు. వీరిలో 10.20 లక్షల మందికి బీమా మంజూరైనట్లు ప్రభుత్వం చెబుతోంది.

దానిమ్మ రైతులకు దగా.. అనంతపురంలో ఆందోళన : ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పంటల బీమాలో దానిమ్మరైతులకు దగానే మిగిలింది. పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. పరిహారం ఇవ్వలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దానిమ్మ దాదాపు 15 వేల ఎకరాల్లో సాగులో ఉంది. పంట సాగులో మొదటి ఏడాది ఎకరాకు 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏడాదికి కనీసం ఎకరాకు లక్ష వరకూ పెట్టాలి.

అయితే గతేడాది అధిక వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా దానిమ్మ పంట చేతికి రాలేదు. ఎకరాకు ఐదారు టన్నుల దిగుబడి రావాల్సిన స్థానంలో ఒకటి రెండు టన్నులూ రాలేదు. 90 శాతం మంది దానిమ్మ రైతులు పంట నష్టపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన బీమా జాబితాలో దానిమ్మ పంట లేకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై సోమవారం అనంతపురంలో ఆందోళన చేయనున్నట్లు రైతులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details