Chandrababu Letter to PM Modi to Help Cyclone Affected Farmers:తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టి మిగ్‌జాం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. తుపానుతో రైతులు నష్టపోయి ఆపదలో ఉంటే ప్రభుత్వం ఆదుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాలుగేళ్లుగా మురుగుకాల్వల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో పొలాల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నష్టం అంచనా వేయకపోవడం దారుణమని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.
రైతు కష్టాలు పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు : చంద్రబాబు
తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ (Chandrababu Letter to Modi) రాశారు. తుపాను వల్ల నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో మెత్తం 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందని 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతీశాయని అన్నారు. తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరుగురికుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని అన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, మొత్తంగా 10 వేల కోట్ల రూపాయల వరకు పంట నష్టం ఉంటుందని అన్నారు.