గుంటూరులోని పార్టీ కార్యలయానికి ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వచ్చారు చంద్రబాబు. పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావటం... తెదేపాకు, చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేయటం ఆయనలో ఉత్సాహం నింపింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వేదికపైకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకూ మాట్లాడే అవకాశం కల్పించారు. ఎవరి అభిప్రాయాలు వారు ధైర్యంగా చెప్పాలని సూచించారు. కార్యకర్తలు మాట్లాడే సమయంలో ఆసక్తిగా విన్నారు.
ఓటమిపై ఆవేశం.. నాయకుల తీరుపై ఆగ్రహం!
ఎన్నికల్లో ఓటమి తర్వాత... ఇవాళ జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన పాల్గొన్న మొదటి కార్యక్రమం ఇదే కావటం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలు మాట్లాడేందుకు అవకాశమిచ్చారు.
మాట్లాడేందుకు కార్యకర్తలకు అవకాశమిచ్చిన తెదేపా అధినేత
తనను కలిసిన వారితో చంద్రబాబు ఫొటోలు దిగారు. చంద్రబాబుని పార్టీ నేతలే మోసం చేశారని...తెదేపా ఓటమికి నాయకులే కారణమని ఓ మహిళా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. గల్లా జయదేవ్ గెలిచినపుడు మిగతా నేతలు ఎందుకు గెలవలేకపోయారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకతా లేదని... ఈవీఎంలలో ఏదో తేడా జరిగిందని మరో కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు.