ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. 'ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అంశంపై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగిన చర్చా వేదికలో కనకమేడల సహా తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా, ప్రొఫెసర్ శ్రీనివాస్, సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
వైకాపా నేతలు 151 సీట్లు వచ్చాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం చూస్తే రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అలాగే అమరావతి నుంచి రాజధాని మార్చే ఏ ప్రక్రియ కూడా న్యాయ సమీక్ష ముందు నిలబడదు. కొవిడ్‌ను అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. హక్కుల అణచివేతలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇలా న్యాయస్థానం తీర్పులను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పాలన చేస్తున్న తరుణంలో రాష్ట్రపతి పాలన వచ్చేందుకు అవకాశం ఉంది- కనకమేడల రవీంద్ర కుమార్, తెదేపా ఎంపీ
మీడియా స్వేచ్ఛను హరించేలా వైకాపా సర్కారు జీవో తెచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్త వచ్చినా ఆ మీడియాపై చర్యలు తీసుకుంటున్నారు. కోర్టు తీర్పులను కూడా గౌరవించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి.. అందరినీ జైల్లో ఉంచాలని కోరుకుంటున్నారు- ఆలపాటి రాజా, మాజీ మంత్రి