పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా గుంటూరు జిల్లాలో 8.78 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. వీరికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు నెలకు రూ.500 చొప్పున నగదు సాయాన్ని అందిస్తారు. నేటి నుంచి 9వ తేదీ వరకు బ్యాంకుల ద్వారా నగదు పంపిణీ చేయనున్నారు. దీనికోసం జిల్లాలోని 850 బ్యాంకు శాఖల పనివేళలను రోజూ ఉదయం 10 నుంచి 4 గంటలకు మార్చారు. జన్‌ధన్ ఖాతాలోని చివరి 2 నంబర్లతో నగదు తీసుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.
ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద జిల్లాలో 3 వేల కుటుంబాలు గ్యాస్ కనెక్షన్లు పొంది ఉన్నాయి. వీరికి ఏప్రిల్ నుంచి 3 నెలలపాటు సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసుకుని సిలిండర్ డెలివరీ సమయంలో ఏజెన్సీ ప్రతినిధికి నగదు చెల్లించి, తమ చరవాణి నంబరుకు వచ్చిన ఓటీపీ సంఖ్య వారికి చెప్పాలి. దాన్ని ఏజెన్సీ ప్రతినిధులు అంతర్జాలంలో నమోదు చేసిన తరువాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు పూర్తి నగదు జమ అవుతుంది.
అన్నదాతకు చేయూత
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం కింద రైతులకు ఏటా రూ.6 వేల నగదును పెట్టుబడి సాయంగా కేంద్రం అందజేస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున అందించే నగదు మేలో జమ చేయాల్సి ఉంది. ఆపద సమయంలో అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వారంలోనే రూ.2 వేల నగదు జమ చేయబోతున్నారు. జిల్లాలో 4,22,412 మంది అన్నదాతలకు ఈ సాయం అందబోతోంది.
పొదుపు సంఘాలకు రుణ పరమితి పెంపు
పొదుపు సంఘాలకు ఇప్పటివరకు బ్యాంకులు అందించే గరిష్ఠ రుణ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. సభ్యులు ఒక్కొక్కరికి రూ.1 లక్ష నగదు చేతికి అందుతుంది. దీన్ని రూ.20 లక్షలకు కేంద్రం పెంచింది. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 95,709 సంఘాలు ఉండగా, ఇందులో 9.57 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో 18,255 సంఘాలకు రూ.570 కోట్ల రుణాలను పంపిణీ చేయాలనే లక్ష్యం ఉంది. రుణ పరపతి పెంపుతో డ్వాక్రా సంఘాలన్నింటికీ మేలు జరగనుంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌కు సంబంధించి రుణ వాయిదా చెల్లించనవసరం లేకుండా మినహాయింపు ఇవ్వడం వారికి ఊరట కలిగించే అంశం.
ఇవీ చదవండి:
కరోనా దరిచేరకుండా... రోజూ 15 నిమిషాలు ఇలా చేయండి