Central Election Team visit AP On the 21st of December: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక అధికారుల బృందం ఏపీలో పర్యటించనుంది. ఈ నెల 21 తేదీన ఏపీకి రానున్న కేంద్ర బృందం 22,23 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించనుంది. గంపగుత్తగా ఫాం 7 దరఖాస్తులు, జీరో డోర్ నెంబర్లలో వందలాది ఓట్లు, ఓటర్లజాబితాలో వాలంటీర్ల జోక్యం తదితర ఫిర్యాదులపై ఈసీ బృందాలు పరిశీలన చేయనున్నాయి.
కొత్తపేటలో ఓట్లు తొలగించడానికి మరో ఎత్తుగడ - స్థానికంగా లేరంటా 4 వేల మందికి పైగా నోటీసులు
అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు,ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. కేంద్ర ఎన్నికల సంఘంలోని కీలకమైన అధికారుల బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి జిల్లా కలెక్టర్లు, రాజకీయ పక్షాలతోనూ భేటీ కానుంది. ఈ నెల 21 తేదీన రాష్ట్రానికి రానున్న ఈసీ అధికారులు డిసెంబరు 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
కేంద్ర ఎన్నికల అధికారుల బృందాల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లకూ సమాచారం పంపించారు. గంపగుత్తగా ఫాం 7 ల దాఖలు, జీరో డోర్ నెంబర్లలో వందలాది ఓటర్లు తదితర అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏపీకి పంపుతోంది. ఈ బృందం రెండుగా విడిపోయి రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల క్షేత్రస్థాయిలో పర్యటించి పరీశీలన చేయనుంది. ఓటర్ల జాబితాల రూపకల్పనలో వాలంటీర్ల జోక్యం, అధికార పార్టీ నేతలు, కొన్ని చోట్ల పోలీసులు కూడా జోక్యం చేసుకుంటున్న ఉదంతాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.