ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ.. 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నోత్తరాలు

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించారు. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేసుకున్నారు. సీఆర్‌పీసీ 161 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

kavitha
kavitha

By

Published : Dec 11, 2022, 12:10 PM IST

Updated : Dec 11, 2022, 10:10 PM IST

CBI Inquiry on MLC Kavitha Concluded : దిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి కవిత ఇంట్లోనే సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. సుమారు ఏడున్నర గంటలపాటు విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. సీఆర్‌పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్టు సమాచారం.

CBI Inquiry on MLC Kavitha : ముందుగా తెలిపిన సమాచారం మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆమెను సాక్షిగా మాత్రమే విచారించారు. ఇంతటి విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారాస్తారా? అనే దానిపై సీబీఐ అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్దకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ..సీబీఐ సుదీర్ఘ విచారణ అనంతరం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎమ్మెల్సీ కవితతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె కార్యకర్తలకు అభివాదం చేశారు. తర్వాత మంత్రి తలసానితో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. ఉదయం నుంచి జరిగిన సీబీఐ విచారణ, తదితర పరిణామాలను కవిత సీఎం కేసీఆర్‌కు వివరించినట్టు సమాచారం. ఆ విషయాలపై చర్చించిన అనంతరం కవిత తన నివాసానికి తిరిగి వెళ్లిపోయారు. సీబీఐ అధికారులు ఉన్నంత సేపు కవిత నివాసానికి పార్టీ నేతలు, కార్యకర్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

CBI Inquiry on MLC Kavitha in Delhi Liquor Scam : ఈ కేసులో కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ కవితకు సీబీఐ మొదట లేఖ రాయగా.. ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ ఆదివారం (నేడు) విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు. ఈ క్రమంలోనే ఇవాళ కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు.

మరోవైపు ఆమె శనివారం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత కవితతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించవని, సీబీఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కవిత పలువురు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తమ ఇంటికి రావద్దని కవిత వారిని కోరారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద భారాస నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. విల్‌ నెవర్‌ ఫియర్‌ (యోధుని కుమార్తె..ఎన్నటికీ భయపడదు) అని వాటిపై రాశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటి మార్గంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

కవితపై సీబీఐ విచారణ చేపట్టడంపై పలువురు రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. సీబీఐ విచారణను లైవ్ కాస్టింగ్ ఇవ్వాలని సీబీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కోర్టులే కేసుల విచారణను లైవ్ ప్రసారం చేస్తుంటే.. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు లైవ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మరోవైపు కవితపై సీబీఐ విచారణను బహిరంగంగా జరపాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర సర్కార్.. ఈడీ, ఐటీ, సీబీఐ పేరుతో ప్రాంతీయ పార్టీ నేతలను బెదిరింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 11, 2022, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details