Capital Farmers Reject The CRDA Notices : అధికారం మాది.. ఇష్టం వచ్చినట్లు చేస్తాం.. నిబంధనలతో పని లేదు, చట్టాలను అనుసరించాల్సిన అవసరం లేదనే రీతిలో రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం నడుచుకుంటోంది. మూడు రాజధానుల ప్రకటన మెుదలుకుని తాజాగా సీఆర్డీఏ చట్టాన్ని సవరణ వరకూ భూములిచ్చిన రైతుల అభిప్రాయం తెలుసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వం, CRDA అధికారుల తీరుకు వ్యతిరేకంగా రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మాస్టర్ ప్లాన్‌కు భిన్నంగా వెళ్లొద్దని హైకోర్టు తీర్పు చెప్పినా.. ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నఅంశాలపై ముందుకెళ్లొద్దని పంచాయతీ అధికారులకూ వినతిపత్రాలు అందజేశారు.
రాజధాని రైతులు విజయవాడ సీఆర్డీఏ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అన్నదాతల నుంచి వేలాది అభ్యంతరాలు రావటంతో అధికారులు స్పందించారు. CRDA చట్ట సవరణపై అభ్యంతరాలు చెప్పాలని ఐదు గ్రామాల రైతులకు నోటీసులిచ్చారు. మంగళవారం నోటీసులు అందజేసేందుకు సీఆర్డీఏ అధికారులు రాజధాని గ్రామాలకు రాగా.. తీసుకునేందుకు అన్నదాతలు ససేమిరా అన్నారు. తమ గ్రామాల్లో సభలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు తేల్చి చెప్పారు.