భాజపా - జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు స్వీకరణ సభకు.. కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబుతో పాటు ఆయన హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో తమ కూటమికి ప్రజలు మద్దతు పలికి.. కుటుంబ రాజకీయాలను రాష్ట్రం నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత వక్కాల సూరిబాబుకు కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాలకు.. సీఎం జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. అమరావతిలోనే రాజధాని కొనసాగాలని.. ముఖ్యమంత్రి ఆలోచన అర్థరహితమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం 23 లక్షల గృహాలను కేటాయిస్తే.. 15 లక్షలు మాత్రమే నిర్మిస్తామని వెల్లడించిందన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి రూ.7వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెబుతున్నా.. భూముల కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఊరుపేరు లేని మద్యం అమ్మకాలతో వేల కోట్లకు ఎర వేశారని దుయ్యబట్టారు.