Benches Destroyed in Mangalagiri Constituency: తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని కొందరు దుండగులు దుశ్చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి నీచమైన చర్యలు గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో సేద తీరేందుకు ఏర్పాటు చేసిన బెంచీలను ధ్వంసం చేసే వరకు దిగజారాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సొంత నిధులతో తన నియోజకర్గంలోని పలు గ్రామాల్లో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ బెంచీలను ధ్వంసం చేయడం అధికార పార్టీకి చెందిన వారి పనే అనే అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.
అసలేం జరిగిందంటే : నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా మంగళగిరిలోని గ్రామాల్లో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. అయితే దుగ్గిరాల మండలం తుమ్మపూడి, పేర్లపూడిలో గుర్తు తెలియని దుండగులు సంక్రాంతి పండగ రోజున సుమారు 9 సిమెంట్ బెంచీలను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి మరి: పేర్లపూడిలోసంక్రాంతి పండగ రోజు రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ నీచపు కార్యానికి దిగారని స్థానిక తెలుగుదేశం నాయకులు అంటున్నారు. బెంచీలను ధ్వంసం చేసే సమయంలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ ఈ చర్యకు పూనుకున్నారని టీడీపీ నేతలు వివరించారు. బెంచీలు లోకేశ్ ఏర్పాటు చేయడంతో లోకేశ్‌కు ఆదరణ దక్కకుడాదనే, పైశాచికత్వంతో ఈ చర్యకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.