Banjarahills Girl Rape Case Updates: బడిలో ఆడుతూ పాడుతూ తిరిగే మూడు, నాలుగేళ్ల పసికూనలు.. లోకం పోకడ తెలియని వారి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న ఓ మృగాడు వారిపై పైశాచికత్వం ప్రదర్శించాడు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో చిన్నారి(4)పై ఇటీవల జరిగిన అఘాయిత్యం కన్నపేగును వణికించింది. తల్లిదండ్రులు సకాలంలో ఆమె ఇబ్బందిని గమనించటంతో నరరూప రాక్షసుడి నిజస్వరూపం వెలుగుచూసింది.
తప్పును నివారించాల్సిన పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.మాధవి, డ్రైవర్ రజనీకుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, కారు డ్రైవర్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బాధితుల్లో 10 నుంచి 15 మంది చిన్నారులు ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం.
పెత్తనమంతా డ్రైవర్‌దే:రజనీకుమార్ మొదటి భార్య నుంచి వేరుపడి రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికో కుమారుడు(10), కుమార్తె(2). కుమారుడు ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. డీఏవీ స్కూల్లో ఒక్కో తరగతిలో 50-52 మంది చిన్నారులున్నారు. ప్రిన్సిపల్ శివరాజు మాధవి వద్ద 11 ఏళ్లుగా బీమన రజనీకుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పేరుకే డ్రైవర్.. ఉపాధ్యాయులకు సలహాలివ్వటం, బోధనాంశాల్లో జోక్యం చేసుకోవడం, ఫీజుల వసూళ్లు, పిల్లలకు శిక్ష విధించడం చేసేవాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
అప్పటికప్పుడు పిల్లల్ని వేర్వేరు తరగతి గదుల్లోకి మార్చుతుండేవాడు. ఇతడి వింత ప్రవర్తన గమనించినా ప్రిన్సిపల్‌కి డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో ఉపాధ్యాయులు మిన్నకుండేవారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో ఇతడి కోసం ప్రత్యేకంగా డిజిటల్ గది కేటాయించారు. అందమైన చిన్నారులను ఎంచుకొని, అందులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు.