ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆటోవాలాలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆటోవాలాలు దోపిడీలకు పాల్పడుతున్నారు. కొన్ని ప్రాంతాలను అడ్డాగా మార్చుకుని అక్కడకు వృద్ధులను తీసుకొచ్చి వారిని బెదిరించి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.

auto wala theft money and gold from old people in narasaraopeta
వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు

By

Published : Jul 21, 2020, 6:07 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని బసికాపురానికి చెందిన శ్రీనివాసరావు(60) అర్వపల్లిలో ఉంటున్న తన కుమార్తె వద్దకు రూ.40 వేలు డబ్బులు తీసుకొని ఇంటి వద్ద నుంచి బయలు దేరాడు. ఆటోలో నరసరావుపేటకు వచ్చి బస్టాండ్‌ వద్ద దిగాడు. మరో ఆటో ఎక్కేందుకు వేచి ఉండగా అప్పటికే అందులో ఇద్దరు యువకులతో ఉన్న ఆటో వచ్చి ఆగింది. డ్రైవర్‌ ఎక్కడికి పెద్దాయన అని అడగ్గా అర్వపల్లి వెళ్లాలని చెప్పాడు. ఈ ఆటో ఆ ఊరే వెళుతుందనడంతో వెంటనే ఎక్కాడు. నరసరావుపేట పట్టణ శివారు విద్యానగర్‌ వద్దకు వెళ్లగానే ఆటోలోని యువకులను పక్కనే దించి వస్తాను దిగమని శ్రీనివాసరావుకు డ్రైవర్‌ చెప్పాడు. దీంతో అతను ఆటో దిగుతుండగానే అతని వద్ద ఉన్న నగదు లాక్కొని ఉడాయించారు. దీంతో బాధితుడు గ్రామీణ పోలీస్‌స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

ఫిరంగిపురానికి చెందిన పి.లక్ష్మమ్మ అనే వృద్ధురాలు భర్తతో కలిసి నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో ఉంటున్న మనవరాలిని చూసేందుకని ఇంటి నుంచి బయల్దేరారు. అక్కడ ఆటో ఎక్కి నరసరావుపేట బస్డాండ్‌ వద్ద దిగారు. ఈ క్రమంలో ఓ ఆటోవాలా వచ్చి ఎక్కడికి వెళ్లాలని వీరిని అడగ్గా పెట్లూరివారిపాలెం అని చెప్పడం వల్ల ఆటో అటే వెళుతుందని ఎక్కించుకుని బయల్దేరాడు. అప్పటికే ఆటోలో ఇద్దరు యువకులు కూర్చోని ఉన్నారు. పట్టణ శివారు ఆంజనేయస్వామి దేవాలయం సమీపానికి వెళ్లగానే ఆటోలో ఉన్న ఇద్దరు యువకులను దించి వస్తానని, ఆటో దిగి అక్కడే ఉండమని వారికి చెప్పాడు. దీంతో వారు ఆటో దిగుతుండగానే లక్ష్మమ్మ భర్త జేబులో ఉన్న రూ.15వేలు లాక్కొని పరారయ్యారు. దీంతో వృద్ధ దంపతులు లబోదిబోమంటూ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా దారిదోపిడికి గురై నగదు, బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉంటున్నారు.

నరసరావుపేట బస్టాండ్‌ సమీపంలో పదుల సంఖ్యలో ఆటోలు ఉంటాయి. కొందరు ఆటో డ్రైవర్లు వృద్ధులను లక్ష్యంగా ఎంచుకొని దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. పట్టణ శివారులో విద్యానగర్‌, ఆంజనేయస్వామి ఆలయం, బైపాస్‌ రోడ్డు ఉన్నాయి. వీటిని అడ్డాగా చేసుకున్న ఆటో డ్రైవర్లు ఈ ప్రాంతాలకు వృద్ధులను తీసుకొచ్చి వారిని బెదిరించి బంగారం, నగదు దోచుకుంటున్నారు. ఒక్క బస్టాండ్‌ వైపునే కాకుండా రావిపాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆటో వాలాలు దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. రూ.100 ఉన్నా సరే బెదిరించి దోపిడీ చేస్తున్నారు. పోలీసులకు తెలిసినవి కొన్ని అయితే వారికి తెలియకుండా అనేక ఘటనలు ఉన్నాయి. దీంతో రాత్రి సమయంలో ఆటోలో ప్రయాణం చేయాలంటే జనం భయపడుతున్నారు.

ప్రత్యేక నిఘా ఉంచుతాం

పట్టణ శివార్లలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొపిడీలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఆటోవాలాలే అధికంగా దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితులను పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తాం. ఇప్పటికే రావిపాడు వద్ద ఓ వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాం. అలాగే వృద్ధులు రాత్రి సమయంలో ఆటోల్లో ప్రయాణించవద్ధు శివారు ప్రాంతాల్లో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తాం. - వెంకటేశ్వరరావు, గ్రామీణ ఎస్సై

ఇదీ చదవండి :

గోపాలపట్నంలో ఓ ఇంట్లో చోరీ.. నగదు, బంగారం ఆపహరణ

ABOUT THE AUTHOR

...view details