ఆశా వర్కర్ విజయలక్ష్మి ఈ నెల 20న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అస్వస్థతకు గురైన ఆమెను జీజీహెచ్లో చేర్చారు. ఆమె కరోనా వ్యాక్సిన్ వల్లే మరణించారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆశా వర్కర్లు, ప్రజా సంఘాల నాయకులు.. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబానికి ఇంటి స్థలం, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయలక్ష్మి కుటుంబానికి కలెక్టర్ భరోసా
విజయలక్ష్మి కుటుంబాన్ని ఆదుకుంటామని.. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ హమీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, జేసీ ప్రశాంతి, డీఎంహెచ్‌వో యాస్మిన్ పరామర్శించారు. కరోనా వ్యాక్సిన్ వల్లే విజయలక్ష్మి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయగా... ఇప్పటికే 10వేల మందికి వ్యాక్సిన్ డోసు వేశామని.. ఎక్కడా ఎలాంటి సమస్య లేదని కలెక్టర్ చెప్పారు. విజయలక్ష్మి మృతికి గల కారణాలను పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుసుకుంటామని.. బాధిత కుటుబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇంటిలో ఒకరి ఉద్యోగం, ఇంటి స్థలం ఇచ్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామి ఇచ్చారు. బాధితులు కోరుతున్నట్లు కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. విజయలక్ష్మి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ తో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించామని.. పోస్టుమార్టం తర్వాత పూర్తి స్థాయి నివేదిక వస్తుందని.. డీఎంహెచ్‌వో యాస్మిన్ తెలిపారు. విజయలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు.