AP Ministers Participated in Industrial Meet at Hyderabad : హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఇండస్ట్రీ మీట్‌లో.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమైనదన్న మంత్రి.. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్రానికి లేనంత ఎక్కువ వనరులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మౌళిక వసతులతోపాటు వివాదరహిత భూమి ఇవ్వడంతో పాటు నీరు, విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విధానం అమలవుతోందని, అనుమతుల కోసం ధరఖాస్తు చేసిన 21 రోజులకు మంజూరయ్యేట్లు విధానాలను తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని కొనియాడుతూనే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలల్లో పరిశ్రమలు ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో మాదిరి ఎలక్ట్రిక్ బస్సులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు వివాదరహితమైన 48వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.