ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతిపై విద్వేషాలు రగల్చడమే లక్ష్యంగా సీఆర్​డీఏ చట్టంలో సవరణలు.. అమరావతి రైతులు

CRDA ACT రాజధాని నిర్మాణం అటకెక్కించడం.. అభివృద్ధి ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం.. రైతుల ఉద్యమాన్ని అణగదొక్కడం.. ఇలా వైకాపా ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ.. అమరావతి పట్ల అక్కసు, వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సీఆర్​డీఏ చట్టాన్ని సవరించడం ద్వారా.. ప్రభుత్వ ఆలోచన మరోసారి ప్రస్ఫుటమయింది. బృహత్‌ ప్రణాళికను భగ్నం చేయడంతోపాటు.. ఇతర ప్రాంతాల వారిలో అమరావతిపై విద్వేషాలు రగల్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టిందని.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోన్‌ల విషయంలో హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. మళ్లీ చట్ట సవరణ చేయడం కోర్టు ధిక్కరణగా వారు చెబుతున్నారు.

Crda
సీఆర్​డీఏ

By

Published : Oct 30, 2022, 7:07 AM IST

THREE CAPITALS మూడు రాజధానుల పేరుతో.. మూడేళ్లుగా అమరావతి రైతులను క్షోభకు గురిచేస్తున్న ప్రభుత్వం మరో ఎత్తుగడతో ముందుకు వచ్చింది. సీఆర్​డీఏ చట్టంలో సవరణలు చేయడం ద్వారా.. రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 పేరిట కొత్త జోన్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పేదలకు ఇక్కడ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించడమే ఈ జోన్‌ ఉద్దేశమని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో చట్టసవరణ, గవర్నర్ సంతకం తర్వాత అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 900 ఎకరాలకుపైగా భూముల్ని ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ భూములు మంగళగిరి మండంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో ఉన్నాయి. రాజధానిలో పేదల కోసం ఎస్‌-3 జోన్‌ను గత ప్రభుత్వమే ప్రకటించింది. రాజధాని ప్రాంతంలోని 14 వేల మంది పేదలకు ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో 7వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి 5 వేలు పూర్తి చేశారు. వీటి కోసం లబ్ధిదారులనూ ఎంపిక చేశారు. వైకాపా ప్రభుత్వం వాటిని పేదలకు కేటాయించకుండా అలాగే ఉంచింది. గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్లనే కేటాయించలేని ప్రభుత్వం ఎక్కడో ఉన్నవారికి సెంటు భూమి ఇస్తామని చెప్పడం మోసం కాక మరేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్‌-3 జోన్‌లో మిగిలి ఉన్న భూముల్ని పేదలకు ఇవ్వొచ్చని సూచిస్తున్నారు.

అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం గతంలో జీవో ఇవ్వగా.. హైకోర్టు దాన్ని కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా హైకోర్టు తీర్పునే సమర్థించారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పులోనూ బృహత్‌ ప్రణాళిక మార్చవద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చింది. అయినా ప్రభుత్వం సీఆర్​డీఏ చట్టాన్ని సవరించి కొత్త జోన్‌ ఏర్పాటు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్​-5 జోన్‌లో బృహత్ ప్రణాళిక ప్రకారం ఇతర ప్రాజెక్టులు రావాల్సి ఉంది. ఈ 900 ఎకరాలను రిజర్వ్‌ జోన్‌, కాలుష్యరహిత పరిశ్రమలు, వాణిజ్య పార్కులు ఏర్పాటు చేయాలని.. బృహత్‌ ప్రణాళికలో పేర్కొన్నారు. రిజర్వు జోన్‌లో అమరావతి ప్రాంత డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి ట్యాంకులు, శుద్ధి ప్రక్రియ వంటి పనులు నిర్వహించాలి. అలాగే కాలుష్యరహిత పరిశ్రమలైన ఐటీ కంపెనీలు, బిజినెస్ పార్కుల నిర్మాణం చేపట్టాలి. రాజధాని గ్రామాల్లోని భౌగోళిక పరిస్థితులు, వాగులు వంకలను సమర్థంగా వినియోగించుకునేలా నిపుణులు బృహత్ ప్రణాళికను రూపొందించారు. కానీ, ఇప్పుడు డ్రైనేజీ ట్యాంకులు నిర్మించే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించడాన్ని.. ప్రజలు గమనించాలని రాజధాని రైతులు కోరుతున్నారు.

సీఆర్​డీఏ చట్టానికి అసెంబ్లీలో సవరణ చేయగానే.. వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పులు ఉన్నప్పటికీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ.. పిటిషన్ దాఖలు చేశారు. ఇది విచారణలో ఉంది. ఇళ్ల స్థలాల విషయంలోనూ ముందుకు వెళ్లొద్దని.. అధికారులకు రైతులు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం కూడా అమరావతి అంశంలో హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై నవంబర్‌ మొదటి వారంలో సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆర్​-5 జోన్‌ ప్రకటించడం సరికాదన్నది రైతుల అభిప్రాయం. అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టి ఇళ్ల స్థలాలు ఇస్తే అభ్యంతరం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ పనులు ఆపేసి స్థలాలు కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. పేదలకు స్థలాలను కేటాయించి.. తర్వాత వారి నుంచి ఆ భూముల్ని లాగేసుకోవాలన్నదే వైకాపా పెద్దల ఆలోచన అని.. రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు, ఆర్​-5 జోన్‌ ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాల కోసం ప్రభుత్వం 15 రోజుల గడువిచ్చింది. నవంబర్‌ 11లోగా సీఆర్​డీఏకి రైతులు తమ అభ్యంతరాలు తెలియజేయొచ్చు. రాజధాని ఐకాసతో పాటు ఆయా గ్రామాల్లోని రైతులు అభ్యంతరాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details