మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఐకాస ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఐకాస నాయకులు ర్యాలీగా వచ్చి.. తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అమరావతిని తరలించవద్దని ప్రార్థిస్తూ అమ్మవారికి వినతి పత్రం అందజేశారు.
మన రాజధాని అమరావతి అనే నినాదంతో గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో 17వ రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. జై అమరావతి సేవ్ అమరావతి అనే నినాదంతో పతంగులు ఎగుర వేశారు. దీక్షా కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే... మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఆరోపించారు. చిలకలూరిపేట మండలం నాగభైరవ వారి పాలెంలో అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. సంక్రాంతి పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చినవారు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. రాజధానిని మార్చొద్దని నినదించారు.