తెలుగు రాష్ట్రాల్లోని రైతు నేస్తాలకు 'చిరు' సాయం - millets
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల వాడకం, సాగుపై రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటి సాగు పట్ల మెళకువలు నేర్పిస్తూ... తక్కువ పెట్టుబడితో లాభాలు ఎలా సంపాదించాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు.
మారుతున్న జీవన శైలి, సరైన ఆహార పద్ధతులు పాటించకపోవడం కారణంగా మానవుడి శరీరం అనారోగ్యాలకు ఆవాసంలా మారుతుంది. అయితే మన ఆహారంలో చిరు ధాన్యాలను తీసుకుంటే ఆరోగ్యంతో పాటు... ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని రైతు నేస్తం ఫౌండేషన్ అంటోంది. వీటిని సాగు చేయడం వల్ల భూమికి కూడా మంచి పోషకాలు అందడమే కాకుండా ...తక్కువ సమయంలో లాభాలు ఆర్జించవచ్చని రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఎన్నో నెలలుగా చిరు ధాన్యాల సాగుపై రెండు తెలుగు రాష్ట్రాలలోను రైతులకు మెళకువలు నేర్పిస్తూ...చిరు ధాన్యాల సాగు వైపు అడుగులు వేయిస్తోంది.