Godavari flood victims: గోదావరి వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ సహాయంగా ఇస్తామన్న పరిహారం.. నెలలు గడుస్తున్నా చాలా మందికి అందలేదు. సర్వే అనంతరం 8 వారాల్లోనే నగదు అందుతున్న ముఖ్యమంత్రి మాట.. నీటి మూటగానే మిగిలింది. స్వయంగా సీఎం జగన్ తమ ప్రాంతానికి వచ్చి హామీ ఇవ్వడంతో.. పరిహారం సొమ్ముతో.. కనీసం కూలిన ఇళ్లనైనా మరమ్మతు చేయించుకోవచ్చని బాధితులు ఆశపడ్డారు. ఇప్పటికీ పరిహారంపై స్పష్టత రాకపోవడంతో.. ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆవేదన చెందుతున్నారు..
ఈ ఏడాది గోదావరి నది వరదల కారణంగా విలీన మండలాల్లోని అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. గ్రామాలకు గ్రామాలను వరద చుట్టుముట్టడంతో.. కట్టుబట్టలతో ప్రజలు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. ఏటా గోదావరికి వరదలు రావడం.., కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలను ముంచెత్తడం పరిపాటిగా మారింది. ఈసారి వచ్చిన వరదలు మరింత తీవ్రరూపం దాల్చడంతో.. దాదాపు 2 నెలల పాటు బాధితులు పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. కొందరైతే... కొండలు, ఎత్తైన ప్రదేశాలకు చేరుకుని.. రోజులు లెక్కపెట్టుకుంటూ గడపాల్సి వచ్చింది.
గోదావరి ఉగ్రరూపం ధాటికి ఈ ఏడాది రెండుసార్లు ముంపునకు గురైన విలీన మండలాల ప్రజలు.. వరదల ధాటికి సర్వం కోల్పోయారు. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పూరిళ్లు పూర్తిగా కూలిపోగా.. పక్కా ఇళ్లు బురదమేటలతో నిండిపోయాయి. రెండు నెలల పాటు ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్న బాధితులు.. తర్వాత ఇళ్లు బాగుచేసుకునేందుకు వస్తే.. అక్కడ ఆనవాళ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకుంటుందని ఎదురుచూశారు. ఈ ఏడాది జులై 27న గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా... ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు 10 వేలు, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్నవారికి 5 వేల రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చారు. సమగ్ర సర్వే అనంతరం 8 వారాల్లోనే పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు.