ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల జోష్​లో టీడీపీ.. నేడు ఏలూరులో పార్టీ నేతలతో కీలక సమావేశం - AP Latest News

Meeting with party leaders in Eluru: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోన్న వేళ, ఆ దిశగా శ్రేణులను సమాయత్తం చేసేందుకు.. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో దిగజారిన ఆర్ధిక పరిస్థితి, వివేకా హత్య కేసులో వెలుగు చూస్తున్న జగన్‌ కుటుంబ సభ్యుల పాత్ర, వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, లక్షల కోట్ల రూపాయల అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడం వంటి పరిణమాల దృష్ట్యా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని తెలుగుదేశం అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా జోన్‌ల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఏలూరులో జోన్‌ 2 పరధిలోని ఐదు పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Meeting with party leaders in Eluru
Meeting with party leaders in Eluru

By

Published : Feb 24, 2023, 9:23 AM IST

Meeting with party leaders in Eluru: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరెంతో దూరం లేదని భావిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ దిశగా శ్రేణులను సన్నద్ధం చేసే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో వచ్చే జోన్‌ 2 లోని ఐదు పార్లమెంట్‌ స్థానాల నేతలతో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏలూరు, నరసాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ఉన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంపచోడవరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో నేడు ఏలూరులో సమావేశమవుతారు. నియోజకవర్గ ఇంచార్జిలు, పరిశీలకులు, పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఎన్నికల మ్యానేజ్మెంట్ కోసం రూపొందించుకున్న క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు సమావేశానికి హాజరవుతారు. రెండు విడతలుగా జరిగే ఈ కార్యక్రమంలో ఆర్టీఎస్​, ఓటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారధి పక్రియ తదితర అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

భోజన విరామం అనంతరం జోనల్, పార్లమెంట్​ల వారీగా ఆయా నియోజకవర్గాల క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలతో అంతర్గతంగా భేటీ అవుతారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న అన్ని వర్గాలను అనుకూల ఓటుగా మలచుకునే లక్ష్యంతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్‌ నుంచి పల్లె నిద్ర పేరుతో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం చేపడుతున్నందున అందుకు ధీటుగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఏఏ వర్గానికి ఎంత సంక్షేమం ఇచ్చామో జగన్‌ చెబుతుంటే...., దక్కిన సంక్షేమానికి పది రెట్లు ఎలా దోచుకున్నాడో వివరించేలా కరపత్రాలను పంచాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఇందుకు స్టార్‌ క్యాంపెయినర్లను నియమించుకుని...., అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా వ్యూహ రచన చేస్తున్నారు.

వైసీపీకు ఉన్న వాలంటీర్లు , గృహ సారధులు వ్యవస్థకు ధీటుగా కుటుంబ సాధికార సారథిలు పేరిట సరికొత్త వ్యవస్థకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. ప్రతి 30 కుటుంబాలకు ఓ కుటుంబ సాధికార సారథిని నియమించి ప్రజలకు మరింత చేరువయ్యేలా ఈ మేర కార్యాచరణ రూపొందించింది. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేలా ఈ కుటుంబ సాధికార సారథిలు పనిచేయనున్నారు. నియోజకవర్గానికి 2,500 నుంచి మూడు వేల మంది వరకు సాధికార సారథులు ఉంటారు. వీరు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకొని డిజిటల్‌ రూపంలో సమాచారాన్ని సేకరిస్తారు. పార్టీ విధానపరమైన నిర్ణయాల్ని, కార్యక్రమాల్ని, భవిష్యత్తు కార్యచరణను ఆయా కుటుంబాలకు వివరిస్తారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందించుకోనుంది. ఇప్పటికే ఉన్న సెక్షన్‌ ఇన్‌ఛార్జులు కుటుంబ సారథులుగా వ్యవహరిస్తారు. కొత్త నియమాకాల్లో మహిళలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. బూత్ లెవల్​లో ప్రతి ఇంటికి ఈ సారధులు వారధులుగా పని చేస్తారు. సాధికార సారధుల పాత్ర, బాధ్యతలపై నేటి సమావేశంలో చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ఇప్పటికే తెలుగుదేశం వివిధ ప్రజా సమస్యలపై అభిప్రాయ సేకరణ చేసింది. దాదాపు 30 లక్షల మంది ఓటర్ల నుంచి తీసుకున్న అభిప్రాయాల క్రోడీకరణలో..., ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తేలింది. ఆ తరువాతి సమస్యల్లో మద్యం, మాదకద్రవ్యాలు, నిరుద్యోగం, విద్యుత్ కోతలు, ఇసుక అక్రమాలు, రహదారులు వంటివి ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న పది ప్రధాన సమస్యల్ని వారి ముందుంచి, వాటిలో ఏ సమస్యతో వారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో ప్రాధాన్యతా క్రమంలో టిక్‌ చేయమని టీడీపీ నాయకులు కోరుతూ వచ్చారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఆయా సమస్యలపై ఎన్నికల వరకూ పోరాడేలా శ్రేణులకు చంద్రబాబు నేటి సమావేశం ద్వారా కార్యాచరణ ప్రకటించనున్నారు.

వినూత్న కార్యక్రమం:తెలుగుదేశం పార్టీ నూతనంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ నెల 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ చేసిన దమనకాండ, తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసుల జులుంని నిరసిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశిస్తూ రాసిన బహిరంగ లేఖను ప్రజలకి మరింత చేరువ చేయడానికి రేడియో పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు, ఇతర ముఖ్య నాయకుల సందేశాలను సోషల్ మీడియాలో మరింత చేరువ చేసేందుకు ఈ రేడియోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే కార్యక్రమాన్ని యువగళం పాదయాత్రలో సైతం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నాయకుని సందేశాన్ని వినడానికి ప్రజలు ఆసక్తిగా చూపుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details