POLAVARAM:పోలవరం ప్రాజెక్టు భూముల పరిహారం పంపిణీ అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక గ్రామాల గిరిజనులు తమకు ఇంకా పరిహారం అందలేదని చెప్పడం, ఇప్పటికే వారి భూములకు పరిహారం చెల్లించినట్లు రికార్డుల్లో నమోదై ఉన్న అంశాలు బయటపడుతూనే ఉన్నాయి. దాదాపు రూ.50 కోట్ల వరకు ఇలాంటి అక్రమాలు జరిగి ఉంటాయని విశ్వసనీయ వర్గాల కథనం. దొంగ పట్టాలు సృష్టించి, కొండ పోరంబోకు భూముల సేకరణలో అనర్హులకు పరిహారం పంపిణీ చేసిన అంశాన్ని మే నెలలోనే ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఈ కుంభకోణంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు. పోలవరం ప్రత్యేకాధికారి ప్రవీణ్ ఆదిత్య విచారణ జరిపి జిల్లా కలెక్టరుకు నివేదిక సమర్పించారు. అనంతరం ఈ అక్రమాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మరో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం
ఈ అక్రమాలు జరిగిన సమయంలో దేవీపట్నం ఎమ్మార్వోగా పని చేసిన వీర్రాజును అధికారులు సస్పెండు చేయడంతోపాటు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్రమాల్లో మరో ఇద్దరు కీలక అధికారుల ప్రమేయం ఉందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో వీటికి కొన్ని ఆధారాలు దొరికినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో భూ సేకరణ ప్రత్యేక కలెక్టరుగా పని చేసిన ఇద్దరు రెవెన్యూ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. అందులో ఒకరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. మరొకరు వేరే చోట విధుల్లో ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.