ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని పరిశ్రమలు
రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్నా తూర్పుగోదావరి జిల్లాలో పలు పరిశ్రమలు యథేచ్ఛగా పని చేస్తున్నాయి. పలు పరిశ్రమల్లో పోలీసు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా నియంత్రణలో భాగంగా అధికారులు ఎక్కడికక్కడ కఠిన చర్యలు చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎర్రవరంలోని అవంతి ఫుడ్ ఫ్రోజెన్ ప్రైవేటు లిమిటెడ్, సీపీఎఫ్ ఆక్వా ఫీడ్ కంపెనీల్లో పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా వందలాది కార్మికులతో పని చేయిస్తున్న కంపెనీ అధికారులను పోలీసులు హెచ్చరించారు. తక్షణం కార్మికులను విడిచిపెట్టి కంపెనీకి సెలవు ప్రకటించాలని ప్రత్తిపాడు సీఐ ఆదేశించారు. పెద్దసంఖ్యలో మహిళలను పదుల సంఖ్యలో బస్సుల్లో తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవంతి ఫుడ్ ప్రొజెన్ కంపెనీలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కార్మికులు పనిచేయడంపై అసహనం వ్యక్తం చేశారు. సీపీఎఫ్ రొయ్యల మేత తయారీ కంపెనీలో నోటికి మాస్కులు కట్టుకుని పని చేస్తున్నప్పటికీ వారిని సైతం పంపించేయాలని సీఐ కోరారు. ఈ కంపెనీలో 15 మంది థాయ్‌లాండ్ దేశస్తులు పని చేస్తుండటంతో వారిని వైద్యాధికారి డా. రమణ పరీక్షించారు. గత రాత్రి థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వారిలో ఒకరిని 14 రోజుల పాటు బయటకు రావొద్దని వైద్యాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.