నేటి నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 11వేల 158 గ్రామ, 3వేల 786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఒక్కో చోట 12 మంది వరకూ ఉద్యోగులను నియమించింది. గ్రామ, వార్డు కార్యదర్శులు, మహిళా పోలీసు, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య శాఖలకు చెందిన సిబ్బంది సచివాలయాల్లో సేవలను అందించనున్నారు.
పథకాలు అర్హుల గడప వద్దకే..
రాష్ట్రవ్యాప్తంగా లక్షా 26వేల 728 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించారు. ఎంపికైన వారందరికీ నియామక పత్రాలను ఇప్పటికే అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హుల గడప వద్దకే అందించడం.... గ్రామాల పునర్నిర్మాణం, నగరాల పౌరసేవల మెరుగుదలలో వీరు ఉపయోగపడనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు విధులను అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ నిర్దేశిత గ్రామాల్లో నిరంతరం అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.