తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 17 ప్రాథమిక పాఠశాలలు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 3500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో దాదాపు 250 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలలు జరిగే సమయంలో పిల్లలకు ఉదయం పాలు, బిస్కెట్లు.. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఒక పూట పౌష్టికాహారం అందించేవారు. కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడడంతో...విద్యార్థులపై ఆ ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతలు చేసిన సాయంతో విద్యార్థుల కుటుంబాలు రెండు నెలలు ఎలానో నెట్టుకొచ్చాయి. కానీ కరోనా ఉద్ధృతి పెరుగుతుండడంతో పనుల్లేక వారి సమస్యలు అధికమయ్యాయి.
సమస్య గుర్తింపు ఇలా
యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా ఆదేశాల మేరకు కరోనా బాధితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.. తమ పాఠశాలలో చదివే విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని గుర్తించారు. విద్యార్థుల కుటుంబాల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులంతా సమావేశమై వారిని ఆదుకోవాలని నిర్ణయించారు.