Sudden transfer of Superintendent: రోజురోజుకూ అధికార పార్టీ అరచకాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. జైల్లో ఉన్నవారిని కలిసేందుకు టీడీపీ నేతలను అనుమతించారని.. గిరిజన అధికారిపై వైసీపీ నేతలు కన్నెర్ర చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. రాజారావును ఆకస్మికంగా బదిలీ చేయించారు. సీఐడీ ఇటివలే అరెస్టు చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, ఆమె మామ, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు ఈ జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో వారిని పరామర్శించడానికి అనుమతిచ్చారనే నేపథ్యంలోనే కారాగారం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు పడింది. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్టు చేసి రాజమహేంద్రవరం కారాగారంలో ఉంచిన సమయంలోనూ రాజారావు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. టీడీపీ నేతలను జైలులో ఉన్న తమ నేతలను కలిసేందుకు ములాఖాత్ నిబంధనల మేరకు అక్కడకు అనుమంతించారనే ఉద్దేశంతో అప్పట్లో ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే, అంతకు ముందు ఆయన వివరణ కోరగా.. అందులో తప్పు లేదని తెలిసాక అక్కడే పోస్టింగ్ ఇచ్చారు.
మళ్లీ ఇప్పుడూ టీడీపీ నేతలను అనుమతించారని రాజారావును నెల్లూరు కేంద్ర కారాగారాల సిబ్బంది శిక్షణ కార్యాలయానికి ప్రిన్సిపల్‌గా నియమించారు. జైలులో ఉన్న వారికి రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, మిథున్ రెడ్డి ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి బదిలీ చేయించారని రాజారావు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మాలాంటి గిరిజనులకు బతికే అర్హత లేదంటూ రాజరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ లేకుండా చర్యలెలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు.