Road Accidents in the State: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొవ్వూరు నుంచి ఏలూరు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటడంతో.. కారు, మెడికల్ వ్యానును అదే విధంగా కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాద సమయంలో కారులో నులుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరొక వ్యక్తి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యంత వేగంతో కారు డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తెలిపారు.
మృతులు పట్నాల రాధాకృష్ణస్వామి.. కృష్ణా జిల్లా వీరవల్లి పీహెచ్సీలో ఎంపీహెచ్ఈవోగా పని చేస్తున్నారు. మరో ఇద్దరు వేమగిరికి చెందిన చక్రవర్తి, రాజమహేంద్రవరంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తులసీరామ్గా గుర్తించారు. రాజమహేంద్రవరంకు చెందిన ఇస్మాయిల్ ప్రమాదంలో గాయపడ్డారు. మృతదేహాల్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు
ధాన్యం లోడ్ చేస్తుండగా ప్రమాదం.. రైతు మృతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మడుపల్లి శివారు ప్రధాన రహదారిపై తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రధాన రహదారిలో అర్థరాత్రి ట్రాక్టర్‌పై ధాన్యం లోడు చేస్తున్న సమయంలో రైతులను ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక రైతు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో.. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైతులను.. అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. పసుపల్లి రహదారి అత్యంత దారుణంగా ఉండటంతో అటుగా వాహనాలు.. వెళ్లేందుకు వీలుకాకపోవడంతో ప్రధాన రహదారి వరకూ ధాన్యాన్ని తీసుకొచ్చి తరలించాల్సి వస్తోందని రైతులు తెలిపారు. ధాన్యం బస్తాలు ట్రాక్టర్‌పై వేసి కడుతున్న సమయంలో ఐషర్ వ్యాన్ రైతులను ఒక్కసారిగా ఢీకొట్టింది.