తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ నాయకులు తమ పెన్షన్లు నిలిపివేశారంటూ... శంఖవరం మండలంలోని మండపం గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల తరఫున ప్రచారం చేసి... తమకు ఓటు వేయలేదనే కారణంతో వైకాపా నేతలు ఇలా చేశారని వాపోతున్నారు. ప్రతీనెలా ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్ ఇప్పటి వరకూ ఇవ్వలేదని కొందరు వితంతువులు, వికలాంగులు, వృద్ధులు చెబుతున్నారు.
'వైకాపా మద్దతుదారులకు ఓటేయలేదని.. పింఛన్ నిలిపేశారు'
తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయలేదనే కారణంతో కొందరికి పింఛను నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలు సాకుగా చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. తమకు వెంటనే పెన్షన్ అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.
సర్పంచి, వార్డు మెంబర్లు ఇచ్చిన ఆదేశాల మేరకే ఆపామని వాలంటీర్లు చెప్పారని వారు అంటున్నారు. వేలిముద్రలు పడటం లేదంటూ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ పెన్షన్ నిలిపివేశారని మరికొందరు లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయకపోతే పింఛను నిలిపివేస్తామని హెచ్చరించారని.. అన్నట్లుగానే చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35 మందికి పెన్షన్ నిలిపివేశారు. భర్తను కోల్పోయిన తమకు వెంటనే వితంతు పెన్షన్ తిరిగి ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.