ఉగాది నాటికి 25 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూమినే ఉపయోగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే చెరువులు, కుంటలు, వాగులు, కాలువలపై దృష్టి పెట్టారు. భూముల రికార్డుల్లో చెరువులు, కుంటలు, వాగులు, కాలువలుగా ఉన్నప్పటికీ... దశాబ్దాల నుంచి వినియోగంలో లేవని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కృష్ణా జిల్లా అధికారి ఒకరు చెప్పారు. ఇటువంటి ప్రతిపాదనలే గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రభుత్వానికి రాబోతున్నట్లు తెలిసింది.
సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు, కాలువలు, వాగులను ఇతర అవసరాలకు మళ్లించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అధికారులు ఇవి ఉపయోగంలో లేవని తెలిపేందుకు వీలుగా నీటి పారుదల, పంచాయతీ, రెవెన్యూశాఖల అధికారులతో కలిసి ఉమ్మడిగా ప్రతిపాదనలను తయారుచేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై సచివాలయ అధికారులు న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుని అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నారు.
రైతుల వ్యతిరేకత
కృష్ణా జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు డ్రైనేజీ పోరంబోకు భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను ఆక్రమణల పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాలకు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తూ పురుగు మందుల డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. ఇటువంటి పరిస్థితులే రాష్ట్రంలో పలుచోట్ల నెలకొన్నాయి.