ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాటేస్తున్నా.. భయం లేదు - తూర్పుగోదావరిలో కరోనా

ఓ వ్యక్తి నిర్లక్ష్యం.. ప్రశాంత గొల్లల మామిడాడ గ్రామంలో కలకలం రేపింది. గ్రామంతో పాటు జిల్లా వ్యాప్తంగా 175 కరోనా పాజిటివ్‌ కేసులకు కారణమైంది.. ఓ నాయకుని ఉదాసీనత కాకినాడలో 11 మందిని వైరస్‌ బారిన పడేసింది. నగరంలో పలు ప్రాంతాలను ఆంక్షల చట్రంలోకి నెట్టేసింది. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌ వెళ్లి వచ్చిన అయినవిల్లి మండలం ఎన్‌.పెదపాలెంకు చెందిన వ్యక్తి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో 22 మంది వైరస్‌ బారినపడ్డారు.

negligence on corona at east godavari
తూర్ప గోదావరిలో కరోనా

By

Published : Jun 14, 2020, 2:21 PM IST

కొందరి నిర్లక్ష్యం తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్‌ విస్తృత వ్యాప్తికి కారణమవుతోంది. అధికార యంత్రాంగం పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా అధిక శాతం మందిలో చైతన్యం కొరవడుతోంది. దీని ఫలితంగానే కరోనా బుసలుకొడుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రోడ్లపై అవసరం లేకున్నా తిరగడం.. మాస్కులు పెట్టుకోక పోవడం..భౌతిక దూరం పాటించక పోవడం.. పుట్టిన రోజు, పెళ్లిరోజు, ఇతర సందర్భాల్లో నిబంధనలు అతిక్రమించి విచ్చలవిడిగా పాల్గొంటుండడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

లాక్‌డౌన్‌ ప్రారంభ దశలో ఆంక్షల అతిక్రమణపై యంత్రాంగం కఠినంగా వ్యవహరించినా అనంతరం చర్యలు నెమ్మదించాయి. ఎట్టకేలకు ప్రభుత్వమే సడలింపులు ఇవ్వడంతో క్షేత్రస్థాయి పరిస్థితి మరింత గాడి తప్పింది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 500కి చేరువైంది. మరణాలూ క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, స్వచ్ఛంద పరీక్షలకు ముందుకు రావాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో పాటు వైద్య,ఆరోగ్య శాఖ యంత్రాంగం పదేపదే పిలుపునిస్తోంది. కొందరు దీనిని తేలిగ్గా తీసుకుంటుండడం ప్రతిబంధకంగా మారుతోంది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు మార్చి 21న నమోదైంది. లండన్‌ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన యువకుడికి పాజిటివ్‌గా తేలడంతో కలకలం మొదలైంది. అనంతరం దిల్లీ పర్యటన, చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌ కలకలం, కోల్‌కతా, తిరుపతి, విజయవాడ ఇలా పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా తేలింది. కత్తిపూడిలో విశాఖ జిల్లా కేసు ద్వారా మరో అయిదుగురు వైరస్‌ బారిన పడ్డారు. అప్పటి వరకు జిల్లాలో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నా మే 20న పెదపూడి మండలం జి.మామిడాడలో పాజిటివ్‌ వ్యక్తి మరణంతో జిల్లాలో కరోనా విజృంభణ మొదలైంది. ఈ గ్రామంలో వైరస్‌తో మృత్యువాత పడిన వ్యక్తి ద్వారా బిక్కవోలు, రామచంద్రపురం, మండపేట, అనపర్తి, తుని మండలాలకు వైరస్‌ వ్యాపించింది. ఏకంగా 175 మంది వైరస్‌ బారిన పడ్డారు.


కేసులంటే లెక్కలేదు..
కొవిడ్‌ నిబంధనల ప్రకారం మాస్కు ధరించకపోతే రూ.500 వరకు అపరాధ రుసుము విధించే వీలుంది. కానీ కొందరు మాస్కుల ఊసేలేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు భౌతిక దూరం పాటించకుండా తిరిగేస్తుండడంతో చిక్కులు వస్తున్నాయి. మార్కెట్లు, ఇతర వ్యాపార ప్రాంగణాల్లో రద్దీగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. వాహనాల్లోనూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో పోలీసులు 35,191 కేసులు నమోదు చేసి రూ.1.75 కోట్ల అపరాధ రుసుము విధించారు. దుకాణాల వద్ద నిబంధనల అతిక్రమణలపై 1,096 కేసులు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనలో భాగంగా 541 ద్విచక్ర వాహనాలు, ఎనిమిది జేసీబీలు, 50 ట్రాక్టర్లు, అయిదు బస్సులు, 34 లారీలు, 50 కార్లు, 83 ఆటోలు, 17 వ్యాన్లు, రెండు టాటాఏస్‌లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఆర్థిక ఇబ్బందులున్నా పద్దు భారీగానే.. 2.60 లక్షల కోట్లు..!

ABOUT THE AUTHOR

...view details