తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పవన్‌కుమార్‌రెడ్డి అనే వ్యాపారిపై నలుగురు య్యూటూబ్ ఛానల్ ప్రతినిధులు దాడి చేశారు. వారు డబ్బులు డిమాండ్ చేయగా ఇచ్చేందుకు పవన్ నిరాకరించటంతో దాడికి పాల్పడ్డారు. ఎస్సై ఆలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం... తేతలి పవన్‌కుమార్‌రెడ్డి అనే వ్యాపారి ఇంటికి విజిలెన్స్ అధికారులమంటూ నలుగురు యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు వెళ్లారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే వారిని గుర్తించిన పవన్.... 'మీరు విలేకరులు కదా విజిలెన్స్ అంటారేంటి' అని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది.
యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు తమ వద్ద ఉన్న కత్తితో వ్యాపారి పవన్ కుమార్ రెడ్డిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. క్షతగాత్రుడిని స్థానికులు అనపర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు బాధితుడి వాంగ్మూలం తీసుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అనపర్తి ఎస్సై ఆలీఖాన్ తెలిపారు.