ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో కొత్తగా 6 కేసులు.. తూర్పుగోదావరి కరోనా@32

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాజమహేంద్రవరం నగర పరిధిలో బుధవారం 6 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 32కి చేరింది.

total corona positive cases in east godavari is 32
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు

By

Published : Apr 23, 2020, 6:28 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని జెండాపంజా రోడ్డు ప్రాంతంలోని 14, 18 ఏళ్ల యువకులతోపాటు.. 18 ఏళ్ల మహిళలో వైరస్‌ లక్షణాలను గుర్తించారు. మంగళవారపుపేటలో 54 ఏళ్ల మహిళలో, బెస్తవీధిలో 30 ఏళ్ల వ్యక్తిలో కొవిడ్ లక్షణాలు వెలుగు చూశాయి. గ్రామీణ పరిధిలోని కొంతమూరులో 50 ఏళ్ల వ్యక్తిలో వైరస్‌ లక్షణాలున్నట్లు పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు నగరంలో 16 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గ్రామీణంలో ఆ సంఖ్య 2కు చేరింది.

రాజమహేంద్రవరం, కాకినాడ, కత్తిపూడి, కొత్తపేట, పిఠాపురం, పెద్దాపురం ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినందున ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి జిల్లా నుంచి 35 మంది వెళ్లారు. వీరిలో ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్‌లో చిక్కుకోగా.. మిగిలిన 33 మంది మార్చి 22న జిల్లాకు వచ్చినట్లు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఈనెల 2న వచ్చిన ఫలితాల్లో ముగ్గురిలో వైరస్‌ లక్షణాలు ఉన్నాయని, మిగిలిన వారిలో ఏమీ లేదని తేల్చారు. ఎలాంటి లక్షణాలు లేని వారిని స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని ఆదేశించారు.

ముందు నెగెటివ్.. ఇప్పుడు పాజిటివ్

అయితే రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలోని కొంతమూరులో వెలుగుచూసిన పాజిటివ్‌ కేసు దిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తేనని అధికారులు గుర్తించారు. ఈ 50 ఏళ్ల వ్యక్తిలో తాజాగా వైరస్‌ జాడ కనిపించినందున అప్పట్లో నెగిటివ్‌ ఫలితాలు వచ్చిన వారందరి నమూనాలను మళ్లీ సేకరించారు. వీరితో పాటు ఆర్టీపీసీఆర్, ట్రూనాట్‌ యంత్రాల ద్వారా 643 మంది నమూనాలు సేకరించారు. వీటి ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. నిన్న విడుదలైన 538 ఫలితాల్లో 6 పాజిటివ్, మిగిలినవన్నీ నెగెటివ్‌ వచ్చాయి. జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాల్లో 377 మంది ఉన్నారు. వైరస్‌ బారినపడిన వారిలో ఇప్పటివరకు 8 మంది కోలుకుని నివాసాలకు వెళ్లారు. కాకినాడలోని జీజీహెచ్‌లో ఒకరు, రాజానగరం పరిధిలోని జీఎస్‌ఎల్‌లో 18 మంది చికిత్స పొందుతుండగా.. విశాఖపట్నంలోని విమ్స్‌లో అయిదుగురు జిల్లా వాసులు ఉన్నారు. వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

6 జోన్లు.. 18 కేసులు

రాజమహేంద్రవరం నగరంలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే 4 జోన్లు కొనసాగుతుండగా తాజాగా నిన్న 4 కొత్త కేసులు వెలుగు చూసిన జెండా పంజారోడ్డును అధికారులు కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇవికాక రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరు కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోకి వెళ్లింది. నగరం, గ్రామీణం కలిపి ఆ సంఖ్య ఆరుకు చేరింది. ఒక్కో జోన్‌ పరిధిలో 2వేల మంది ఉండగా వీరందరు నిత్యావసరాలకు ఇబ్బందులు పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్‌ కమిషనర్ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు.

ఇవీ చదవండి.. 'మసీదుల్లో ప్రార్థనలకు ఇద్దరు మతపెద్దలకే అనుమతి'

ABOUT THE AUTHOR

...view details