తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం లెనోరా విద్యాలయ ప్రాంగణంలో ఉన్న కొవిడ్ సెంటర్ మేడపై నుంచి దూకి తీగల రమేష్ (33) అనే గిరిజనుడు మృతి చెందాడు. రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామంలో తీగల రమేష్ భార్య చిన్నయమ్మ రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం ర్యాపిడ్ టెస్టు చేయించుకోగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో వారు లెనోరా కొవిడ్ సెంటర్లో చేరారు. బుధవారం అర్ధరాత్రి కొవిడ్ సెంటర్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రమేష్ . దీంతో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి బాధితుడ్ని తరలించారు. తీవ్ర గాయాలపాలైన రమేష్ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
దీనిపై కొవిడ్ సెంటర్ ఇంచార్జి డాక్టర్ నరేశ్‌ను వివరణ కోరగా.. బుధవారం రాత్రి రమేష్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడని తమ సిబ్బంది తీసుకొచ్చి గదిలో పెట్టడం జరిగిందన్నారు. అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చి మేడపై నుంచి దూకేశాడని తెలిపారు. దీంతో తమ సిబ్బంది ఏరియా ఆస్పత్రిలో అతన్ని చేర్చారన్నారు.