వాలంటీర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందించే లక్ష్యంతో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి చెప్పారు.
అనపర్తి మండలంలోని కొందరు వాలంటీర్లు... బాధ్యతారాహిత్యంగా పని చేయడంతో పాటు అవినీతికి పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వాలంటీర్లపై ఏం చర్యలు తీసుకున్నారని సంబంధిత అధికారులను ఆయన ప్రశ్నించారు. విచారణ పేరుతో రోజుల తరబడి ఆలస్యం చేయవద్దని, ఫిర్యాదు అందిన రెండు రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని సూచించారు.