తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 న అర్ధరాత్రి 12.30 నుంచి రెండు గంటల వరకు శ్రీవారికి ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ ఇతరత్రా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
6వ తేదీ ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి స్వర్ణరథంపై ఆలయ మాఢ వీధుల్లో ఊరేగుతారు. సాయంత్రం 5నుంచి రాత్రి 7గంటల వరకు సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవాలు చేపడతారు.