శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులను నియమిస్తూ తితిదే ధర్మకర్తల మండలి తీర్మానించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. గత సంప్రదాయాన్నే ఈసారీ కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి అన్నమయ్య భవనంలో దాదాపు 5 గంటల పాటు జరిగిన ధర్మ కర్తల మండలి సమావేశంలో తితిదే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం
ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు వైకుంఠ ఏకాదశి రోజున గతంలో కంటే అరగంట సమయం కుదించామని.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని ధర్మ కర్తల మండలి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
ముఖ్య తీర్మానాలివీ
⦁ 2019-20 ఆర్థిక సంవ్సరానికి తొలుత రూ.3016.25 కోట్ల వ్యయంతో బడ్జెట్ రూపొందించారు. సవరించిన అంచనా ప్రకారం రూ.3243.19 కోట్లకు పెంపు.
⦁ జమ్ము, వారణాసిల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తీర్మానం
⦁ ముంబయిలో రూ.30 కోట్ల వ్యయంతో వెంకటేశుని ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర
⦁ తితిదేలో ప్రత్యేకంగా సైబర్ భద్రతా విభాగం ఏర్పాటు