ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు తితిదే ధర్మకర్తల మండలి సమావేశం - తితిదే సమావేశం

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి రెండో సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో నేడు జరగనుంది. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి 44 అంశాలతో కూడిన అజెండాను రూపొందించారు.  పలు కీలక అంశాలపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

By

Published : Oct 23, 2019, 5:29 AM IST

నేడు తితిదే ధర్మకర్తల మండలి రెండో సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తొలి సమావేశానికి 184 అంశాలతో భారీ ఎజెండా రూపొందించినా.. సమయా భావంతో కొన్నింటిపై మాత్రమే చర్చించారు. గత సమావేశంలో మిగిలిపోయిన వాటిలో కొన్నింటితో పాటు అదనంగా మరికొన్ని అంశాలను సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ జరగనున్న ఈ సమావేశానికి 44 అంశాలతో అజెండా రూపొందించారు.
ప్రధానంగా తిరుపతిలో గరుడవారధి నిర్మాణానికి తితిదే నిధుల కేటాయింపు, తిరుమల తాగునీటి అవసరాల కోసం బాలాజీ జలాశయం నిర్మాణానికి ఆర్థికసాయం, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న స్విమ్స్‌ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో తితిదే పరిధిలోకి తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీలకు సబంధించి తితిదే పరిధిలో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌ల భర్తీ వంటి కీలక అంశాలకు సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
వీటితో పాటు తితిదే ప్రజాసంబంధాల అధికారికి చీఫ్‌ పీఆర్‌ఓగా పదోన్నతి కల్పించడంతో పాటు ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు ప్రత్యేకంగా ప్రజా సంబంధాల అధికారి(పీఆర్​వో)ను నియమిస్తూ తీసుకొన్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నారు. తితిదే పరిధిలో ఉన్న హిందూ ధర్మప్రచారపరిషత్‌ ఛైర్మన్‌ నియామకంపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
తితిదే బోర్డు సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నికైన 36 మందిలో కొంత మంది తొలి సమావేశం నాటికి ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో వారు హాజరుకాలేదు. దీంతో 28 మంది సభ్యులతో తొలి సమావేశం జరగ్గా...ఇవాళ జరగనున్న రెండో సమావేశానికి పూర్తి స్థాయిలో సభ్యులు హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details