- చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో కమ్మపల్లె పంచాయతీకి ఓ వ్యక్తి నామినేషన్ వేశాడు. మరునాడు తిరుపతిలో అతని బంధువుల చికెన్ సెంటర్లు నాలుగు మూతపడ్డాయి. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు దాడులు చేసి జరిమానా వేయడంతోపాటు మూతవేయించారని ఆరోపణలు వచ్చాయి. పోటీ నుంచి తప్పుకొంటామన్న తర్వాత దుకాణాలు తెరచుకోవడానికి అనుమతించారని సమాచారం.
- శ్రీకాళహస్తి మండలం ఓబులాయనపల్లె పంచాయతీకి నామినేషన్ వేసిన సుబ్రమణ్యం నాయుడుకు శుక్రవారం బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. తప్పుకోకపోతే ఇంట్లో ఎర్రచందనం దాచి.. కేసు పెడతామని హెచ్చరించారు.
- సోమల మండలంలో ఓ పార్టీ మండల అధ్యక్షుడి మీద కేసు పెట్టి ఊరి నుంచి పరారయ్యేలా చేశారు.
- పులిచెర్లలో పంచాయతీ కార్యదర్శులను బెదిరించారనే అభియోగంపై విపక్షాల్లోని ఔత్సాహికులపై కేసులు పెట్టారు. ఇప్పుడు వారు నామినేషన్ వేయకపోవడమే కాదు, గ్రామాల్లోంచి అదృశ్యమయ్యారు.
ఇదీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విపక్షాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రత్యర్థులపై అధికార పార్టీ వేధింపులు, కేసులు పెచ్చుమీరుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ధైర్యంగా నామినేషన్లు వేసిన గ్రామాల్లో విచిత్ర కారణాలతో తిరస్కరింపజేశారని అభ్యర్థులు వాపోతున్నారు. మూడో విడతలో పోలింగ్ జరిగే పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, పుంగనూరు, సోమల, చౌడేపల్లె, రొంపిచెర్ల మండలాల్లో 85 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. శుక్రవారం ప్రత్యర్థులందరూ పోటీ నుంచి తప్పుకోవడంతో వైకాపా మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించి, వారికి డిక్లరేషన్ సైతం అందజేశారు.
ఇదీ చదవండి: