ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ 'చుక్క'... కరవును జయించింది

ఎంతటి కరవు వచ్చినా... ఆ చెరువు మాత్రం ఎండదు. నాలుగు దశాబ్దాలుగా జలకళతో ఉట్టిపడుతూ.... కరవును సైతం వెక్కిరిస్తూ ఎన్నో గ్రామాల ప్రజలకు కల్పతరువుగా మారింది.

By

Published : Aug 4, 2019, 8:09 AM IST

చెరువు

ఆ చెరువు... కరవును జయించింది

సరైన నీటి సౌకర్యం లేకపోవటం.... హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్​లు నిర్మాణ దశలోనే ఉండటం వలన....చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో క్షామం రాజ్యమేలుతుంది. కానీ ఐరాల మండలంలోని చుక్కా వారిపల్లె చెరువు మాత్రం ఇందుకు మినహాయింపు. ఎన్ని కరవులొచ్చినా.... నాలుగు దశాబ్దాలుగా నిత్యం జల సిరితో కలకలలాడుతోంది. కేవలం చుక్కా వారిపల్లెనే కాదు.. చుట్టు పక్కల గ్రామాలకు కల్పతరువుగా మారింది.

సుమారు 42 రెండేళ్ల క్రితం... చుక్కా వారిపల్లెను కరవు తీవ్రంగా ప్రభావితం చేసింది. చుక్క నీటి కోసం మైళ్లు నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. వీటికి అడ్డు కట్ట వేయాలనే ఉద్దేశంతో అప్పటి గ్రామ పెద్దలుగా ఉన్న కక్కే నాగయ్య, తాళ్లూరి రామయ్య తీవ్రంగా ప్రయత్నించారు. రెండు కొండల నడుమ వేగంగా ప్రవహించే వంకకు అడ్డుకట్ట వేసి చెరువు చేయాలని అప్పటి నాయకుల చుట్టూ తిరిగేవారు. గ్రామంలో ఓ యువ జన సంఘాన్ని ఏర్పాటుచేసి... సమస్యపై చిన్నపాటి యుద్దమే చేశారు. అప్పటి ప్రజాప్రతినిధులు సహకరించటం వలన... హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంజనీర్లు... చెరువును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు. అలా 1978నాటికి 20లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటైన ఈ చుక్కావారిపల్లె చెరువులో.... నాటి నుంచి నేటి వరకు జలకళ ఉట్టిపడుతూనే ఉంది.


చెరువు నిర్మాణం పూర్తయి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా... చుక్కావారిపల్లె చెరవు ఎండిందే లేదు. ఇక్కడ సమృద్ధిగా నీరు నిల్వ ఉండటం వలన... భూగర్భజలాల స్థాయి సైతం పెరిగి... చుట్టు పక్కల ఎక్కడ చూసినా పచ్చదనమే కనువిందు చేస్తోంది. చెరువు కారణంగా....కేవలం చుక్కా వారిపల్లె మాత్రమే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో సుమారు 400 ఎకరాల సాగుభూమి సస్యశ్యామలం అవుతోంది. అటవీ ప్రాంతం గుండా ప్రవహించే వంకకు అడ్డంగా చెరువు నిర్మించటంతో....ఎప్పుడూ జలకళతో ఉట్టిపడుతూ....సాగుకు సాయమవ్వటమే కాక..... పశుపక్ష్యాదుల దాహార్తిని తీరుస్తోందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటి విలువను గుర్తించి... సరైన పద్ధతిలో సంరక్షణ చర్యలు చేపడితే... ఫలితం ఎలా ఉంటుందో నాలుగు దశాబ్దాలుగా నిరూపిస్తోంది చుక్కావారిపల్లి చెరువు.

ABOUT THE AUTHOR

...view details