ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మతనంలోని గొప్పతనాన్ని చాటిన మాతృమూర్తి - అమ్మతనంలోని గొప్పతనాన్ని చాటిన మాతృమూర్తి వార్తలు

జీవితమన్నాక సవాళ్లు సహజమే. జీవితమంతా సవాళ్లే ఎదురైతే..? ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా..! కానీ శరీరకంగా, మానసికంగా బాధపడే పిల్లల తల్లులకు మాత్రం సవాళ్లు నిత్యకృత్యం. అల్లారు ముద్దుగా పెంచుకుందామనుకున్న బిడ్డలను విధి వెక్కిరించగా...ఆ బాధను కడుపులో దాచుకుని కాచుకోవడం అంటే ఆ తల్లులది ఎంత యాతనో చెప్పనవసరం లేదు. అయినప్పటికీ ఆ వేదనను మరిచిపోయి అనుక్షణం పోరాటమే పంథాగా సాగిపోతుంటూరు ఎంతోమంది తల్లులు. మాతృదినోత్సవం వేళ అలాంటి ఓ తల్లిపై ప్రత్యేక కథనం.

The mother spread the greatness
అమ్మతనంలోని గొప్పతనాన్ని చాటిన మాతృమూర్తి

By

Published : May 9, 2021, 7:03 AM IST

అమ్మతనంలోని గొప్పతనాన్ని చాటిన మాతృమూర్తి

డాక్టర్​ ఐతరాజు స్రవంతి...ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్. సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణిగా ప్రభుత్వ విధులు..క్లినికల్ సైకాలజిస్ట్​గా వందలాది సెమినార్లు..బిజీబిజీగా గడిచిపోయే జీవితం ఆమెది. కానీ ఆమె కష్టం వెనుక ఉన్న కన్నీళ్లు.. గుండెలోని బాధ వర్ణణాతీతం. పదిమందికీ మానసిక ఆరోగ్యం గురించి బోధించే స్రవంతి జీవితంలో చెప్పలేని బాధలున్నాయి.

స్రవంతి ఒక్కగానొక్క కుమారుడు చందన్. వయస్సు 18 సంవత్సరాలు. పుట్టుకతోనే ఆటిజంతో బాధపడుతున్నాడు చందన్. అందరి పిల్లల్లా హాయిగా ఆడుకోవాల్సిన వయస్సులో ఇంటికే పరిమితమై తన కొడుకుని చూసి ఈ తల్లి లోలోపలే గుండెలవిసేలా రోదించేది. విధి వెక్కిరించినా బాబును చక్కదిద్దటం తల్లిగా తన బాధ్యతని తనకు ధైర్యం తెచ్చుకున్నారు. చందన్​తో అక్షరాలు రాయించడం, సొంత పనులు చేసుకునేలా శిక్షణనిచ్చారు. అలా మెల్లగా ఆటిజాన్ని అధిగమించి మామూలు పిల్లాడిలా మారుతున్నాడని ఆనందించిన ఈ తల్లి జీవితాన్ని ఓ సంఘటన మళ్లీ కుదిపేసింది. ఐదేళ్ల వయస్సులో ఒకరోజు ఆడుకుంటూ తెలియక ట్రాన్స్​ఫార్మర్ వైరు పట్టుకున్నాడు చందన్. అంతే విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మెదడు ఎడమ వైపు భాగం పూర్తిగా విద్యుత్ ప్రభావానికి లోనైందని వైద్యులు తెలిపారు. ఎడమ చేతిని తీసెయ్యాలని చెప్పటంతో ఆ తల్లి మరింత ఆందోళనలో కూరుకుపోయారు. 14 శస్త్ర చికిత్సల అనంతరం చందన్​ మళ్లీ మామాలుగా మారాడు. కానీ ఆటిజం వెంటాడుతూనే ఉంది.

బాబు పూర్తిగా కోలుకున్న తర్వాత...ఆటిజంపై పూర్తి పట్టు సాధించాలనే సంకల్పంతో..స్రవంతి అదే అంశంపై పీహెచ్​డీ చేసింది. హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్ బిహేవియర్ ఆఫ్ ఆటిస్టిక్ మెంటల్లీ ఛాలెంజెడ్ చిల్డ్రన్ అనే అంశంపై శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో పీహెచ్​డీ పూర్తి చేశారు. అలా బాబు భావోద్వేగాలను నియంత్రిస్తూ...ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రేమగా తెలుసుకునేవారు. చందన్ మాట్లాడలేడు కాబట్టి...పాట ట్యూన్​లతో దగ్గర కావాలని స్రవంతి భావించారు. చందన్​కి నిత్యం అవసరమయ్యే ఒక్కో విషయానికి ఒక్కో పాట పాడుతూ....తిరిగి పాడాలని చెబుతూ అతడి మెదడుకు పని చెప్పటం ప్రారంభించారు. ఆ ప్రక్రియ విజయవంతమైందని స్రవంతి చెబుతున్నారు.

18 ఏళ్ల వయస్సుకు చేరుకున్న చందన్​కి అందరి మాటలూ పూర్తిగా అర్థమవుతున్నాయి. చెప్పిన పనిని ఎంచక్కా చేస్తాడు. నమస్కారం, థాంక్స్ అంటూ పలుకుతాడు. ప్రేమగా అమ్మకు ముద్దు పెడతాడు. మందులను తీసుకువచ్చి అమ్మకు ఇస్తాడు. తానే సొంతంగా తినటం... ఇలా ఎన్నో భావోద్వేగాలను అలవోకగా పలికించగలుగుతున్నాడు. ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యం కాకపోయినా...పట్టు విడవకుండా... ఓ తల్లిగా మనసు పెట్టి ఓపికగా చేసినందునే వీలైందని స్రవంతి భావోద్వేగంతో చెబుతున్నారు.

మాతృదినోత్సవ వేళ...అమ్మతనంలోని గొప్పదనాన్ని ఘనంగా చాటుతున్న స్రవంతి....ఆటిజం పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీచదవండి

మంటగలిసిన మానవత్వం: బతికుండగానే కాటికి వృద్ధురాలు !

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details