ఎస్వీయూ రెక్టార్ రాజీనామా.. ఆచార్య భాస్కర్‌కు బాధ్యతలు
ఎస్వీ విశ్వవిద్యాలయ రెక్టార్ జానకి రామయ్య పదవి నుంచి తప్పుకున్నారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన.. వాటిపై విచారణ జరుగుతుండగానే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ప్రైవేట్ బీఈడీ కళాశాలల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ రెక్టార్ జానకిరామయ్య.... పదవికి రాజీనామా చేశారు. బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తిరుపతిలోని ఎస్వీ వర్శిటీలో నిర్ణయాన్ని ప్రకటించారు జానకిరామయ్య. కొద్దిరోజుల క్రితం ఎస్వీయూలో రెక్టార్ జానకిరామయ్య ఆడియో టేపుల వ్యవహారం కలకలం సృష్టించింది. అర్హత లేకున్నా కొన్ని ప్రైవేట్ కళాశాలలకు తరగతుల నిర్వహణకు సంబంధించి జానకిరామయ్య సలహాలు ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో టేపులను విద్యార్ధి సంఘాలు బయటపెట్టాయి. ఈ వ్యవహరంపై విచారణ కొనసాగుతుండగానే జానకిరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఎస్వీయూకు నూతన రెక్టార్‌గా ఆచార్య మచ్చా భాస్కర్ నియమితులైనట్లు ఉపకులపతి రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.