తిరుమలలో శ్రీనివాసుడుని దర్శించుకోవాలంటే... దూరం నుంచే సాధ్యం. ఇప్పుడు స్వామి మాత్రమే కాదు.. భక్తులు కూడా ఒకరికి ఒకరికి మధ్య తగిన దూరాన్ని పాటించాలి. ఇక నుంచి స్వామి దర్శనానికి భౌతిక దూరం తప్పనిసరి. మూడో విడత లాక్ డౌన్.. నేటితో ముగుస్తోంది. లాక్ డౌన్ 4.. సరికొత్తగా ఉంటుందని ప్రధాని మోదీ ఇటీవలే సంకేతాలు ఇచ్చారు. ఆంక్షలతో కూడిన సడలింపులు మరిన్ని ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆలయాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిస్తే.. భక్తులను దర్శనానికి పంపేందుకు అవసరమైన జాగ్రత్తలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు... తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది.
శ్రీవారి ఆలయంలో.. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 తో పాటు.. శ్రీవారి ఆలయం, వరాహస్వామివారి ఆలయాల్లోనూ భక్తులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ పనులు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, అనుమతుల మేరకే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఇటీవలే తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆ మేరకు.. ఆలయం తెరిస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.