ఏడాదికోసారి మాత్రమే ఆదాయాన్నిచ్చే మామిడి పంటకు ధర ప్రశ్నార్థకమైంది. చిత్తూరు జిల్లాలో విస్తారంగా పంట సాగైంది. ఈ సీజన్‌లో దాదాపు 5 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ అంచనా. పంట కోతకు వచ్చినా... దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా వచ్చే వ్యాపారుల జాడ కానరావడం లేదు. టన్ను ప్రస్తుతం రూ.12 వేలు వరకు పలుకుతోంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
జిల్లాకు ప్రాధాన్యమేది?
ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా రవాణా చేయడంతో పాటు రైతులకు మంచి ధరలు దక్కాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టినవే కిసాన్ రైళ్లు. జిల్లాకు ఇప్పటి వరకు ఉపయుక్తంగా లేకపోయాయి. అనంతపురం, నూజివీడు నుంచి ఆదర్శనగర్(దిల్లీ)కు నడిపినా.. జిల్లాకు టమోటా ఎగుమతుల కోసం తూతూ మంత్రంగా ప్రవేశపెట్టి నిలిపివేశారు. ప్రస్తుతం మామిడితో పాటు వివిధ పంటల ఎగుమతికి సౌలభ్యం ఉంది. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం చొరవ తీసుకోవడం, రైల్వేశాఖ సహకరించడం ద్వారా రైతులను ఆదుకునే అవకాశం ఉంటుంది.
రైల్వే, ఉద్యానశాఖ అధికారుల వర్చువల్ సమావేశం
ఉద్యానశాఖ డీడీ శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంగళవారం రైల్వే, ఉద్యానశాఖ అధికారులు, రైతు సంఘాలతో ప్రత్యేకంగా వర్చువల్ సమావేశం నిర్వహించారు. గుజ్జు తయారీకి వినియోగించే తోతాపురి మినహా ఇతర రకాలను ఎగుమతికి ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో కిసాన్ రైల్లో 14 వరకు పార్సిల్ వ్యాన్లు ఉంటాయి. ఒక్కో వ్యాన్ సామర్థ్యం 23 టన్నులు వరకు ఉంటుంది. పూర్తి వ్యాన్ వినియోగించుకునే పక్షంలో ప్రత్యేక రైలు నడిపే అవకాశం ఉంటుంది. ఒకట్రెండుకు అయితే ఎక్స్‌ప్రెస్ రైలుతో అనుసంధానం చేస్తామని రైల్వే అధికారులు పూచీ ఇచ్చారు. ఇందుకు రైతులు, రైతు సంఘాలు ఎగుమతికి సిద్ధంగా ఉండాలని డీడీ కోరారు. పాకాల కేంద్రంగా ఎగుమతికి ఉపయుక్తంగా ఉంటుందని జూమ్ మీటింగ్‌లో నిర్ణయించారు.