ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sericulture: పట్టు రైతులకు రాయితీలు చెల్లించేది ఎప్పుడో..? - పట్టు పంటసాగు

పట్టు రైతులకు ప్రభుత్వమిచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు నాలుగైదు నెలలుగా అందడం లేదు. కిలో పట్టుగూళ్లకు ఇచ్చే 50 రూపాయల ప్రోత్సాహకం, పట్టుగూళ్ల ఉత్పత్తి కేంద్రాల పారిశుద్ధ్య కిట్‌ కోసం ఇస్తున్న 3 వేల 750 రూపాయల రాయితీ ఆగిపోయింది. చాకీ హ్యాండ్లింగ్‌ పేరుతో వంద విత్తన గుడ్లుకు ఇచ్చే 500 రూపాయలూ రావడం లేదు. రాయితీలు అందక పంటకు గిట్టుబాటు ధర లేక మల్బరీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Sericulture
Sericulture
author img

By

Published : Aug 29, 2021, 11:07 AM IST

పట్టు రైతులకు నాలుగు నెలలుగా ఆగిన రాయితీలు

రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మల్బరీ పంటను సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, కదిరి, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల్లో 27 వేల 820 మంది రైతులు.. దాదాపు 46 వేల ఎకరాల్లో పట్టు పంటను సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పట్టుగూళ్లను విక్రయించడం ద్వారా కిలోకు 200 నుంచి 250 రూపాయల వరకూ వస్తుంది. దానిపై ప్రభుత్వం అందించే 50 రూపాయల ప్రోత్సాహకంతో రైతులకు కొంతమేర లబ్ధి చేకూరేది. కరోనా ప్రభావంతో ఓ పక్క గిట్టుబాటు ధర లేకపోగా.. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలూ ఆగిపోయాయి.

పట్టు పంటసాగులో పట్టుగూళ్ల ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ అత్యంత ప్రధానమైనది. ఒకసారి పంట వచ్చిన తర్వాత రెండో సారి విత్తన గుడ్లను తెచ్చి.. పంట ప్రారంభించే సమయంలో పట్టుగూళ్ల ఉత్పత్తి కేంద్రాన్ని శుద్ధి చేస్తారు. పారిశుద్ధ్యం కోసం బ్లీచింగ్‌ పౌడర్‌, సెరిఫిట్‌ వాడుతారు. రేషం పురుగులు పెంచే సమయంలో సున్నం, విజేత లాంటి రసాయనాలను ఉపయోగిస్తారు. 5 వేలు ఖరీదు చేసే వీటన్నింటి కోసం.. రైతులు 12 వేల50 రూపాయలు తమ వాటాగా చెల్లిస్తే.. 3 వేల 750 రూపాయలు ప్రభుత్వం రాయితీగా అందజేసేది. 4 నెలలుగా ఆ రాయితీ సొమ్మూ ఆగిపోయింది. పంటలో నష్టాలే వస్తున్నాయని.. సాగు చేయాలన్న ఆసక్తి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సాంకేతిక పరమైన సమస్యలతో పాటు వివిధ కారణాలతో పట్టు రైతులకు ఇచ్చే రాయితీలు, చాకీ హ్యాండ్లింగ్‌ ఛార్జీల చెల్లింపులు ఆగిపోయినట్లు.. అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 25 వేల పట్టుగూళ్ల ఉత్పత్తి కేంద్రాలకు 9 కోట్ల 37 లక్షల రూపాయలు, అనంతపురం జిల్లాలో 30 వేల పట్టుగూళ్ల ఉత్పత్తి కేంద్రాలకు 11 కోట్ల 25 లక్షల రాయితీ.. రైతులకు అందాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details