సుందరమ్మ కండ్రిగ..
నగరి గ్రామీణ మండలం తమిళనాడు రాష్ట్ర సరిహద్దులోని తడుకుపేట(వెంకటనరసింహరాజువారి పేట) పంచాయతీ పరిధిలోని సుందరమ్మ కండ్రిగ.. ఊరు ఒకటే అందులో రెండు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. ఒకే వీధిలో ఇరు రాష్ట్రాల ప్రజలు కలిసి నివాసం ఉంటున్నారు. గ్రామంలో సుమారు 56 కుటుంబాలు ఉండగా.. అందులో 34 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, మిగిలిన వారు తమిళనాడు పరిధిలో ఉన్నారు. గ్రామంలో 256 మంది ఓటర్లున్నారు. అందులో 186 మంది తమ ఓటును ఆంధ్రప్రదేశ్‌లోని తడుకుపేట పంచాయతీలో.. మిగిలిన 70 మంది తమిళనాడులోని నెలటూరు గ్రామ పరిధిలో వినియోగించుకుంటారు. ఊరు ఒకటే అయినా తెలుగులో సుందరమ్మ కండ్రిగ అని పిలుస్తారు. తమిళనాడు వాసులు గోపాలకృష్ణపురం అని పిలుస్తారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పథకాలు వీరికి వర్తిస్తాయి. తెలుగు, తమిళ భాషలు వాడుకలో ఉన్నాయి. గ్రామంలో తమిళనాడు ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను నిర్మించింది. తెలుగు వారు పిల్లల్ని సమీపంలోని తడుకుపేట పాఠశాలకు పంపిస్తున్నారు.
కనకమ్మసత్రం
విజయపురం మండలంలోని మహారాజపురం పంచాయతీకి చెందిన కనకమ్మసత్రం గ్రామం తమిళనాడు సరిహద్దులో ఉంది. గ్రామంలో కొంత భాగం ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన ప్రాంతం తమిళనాడులో ఉంది. ఒకే వీధిలో అటు తమిళవాసులు, ఇటు తెలుగువారు ఉన్నారు. ఇక్కడ వంద మందికి పైగా నివాసం ఉంటున్నారు.