'చంద్రగిరిలోని 2 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి' - chevireddy
రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి సుజాతశర్మతో తెదేపా నేత కళా వెంకట్రావు భేటీ అయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరారు.
రాష్ట్రంలో తెదేపా, వైకాపాలు చేస్తున్న ఫిర్యాదులపై వేర్వేరుగా స్పందిస్తున్న ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదులపై ఒకలా,.. వైకాపా నేతలు చేస్తున్న ఫిర్యాదులపై మరోలా ఈసీ అధికారులు స్పందిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని వాటిలో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర సచివాలయంలోని అదనపు ఎన్నికల ప్రధానాధికారి సుజాత శర్మతో కళా వెంకట్రావు భేటీ అయ్యి ఈ విషయాన్ని వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలోని రెండు కేంద్రాల్లో అవకతవలకపై తెదేపా అభ్యర్థి ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని.. పోలింగ్ అయిన 24 రోజులు తరువాత వైకాపా అభ్యర్థి కొన్ని పోలింగ్ కేంద్రాలపై ఫిర్యాదు చేస్తే ఈసీ విచారణకు ఆదేశించటమేంటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు.