gravel mafia: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి, డోర్నక అంబాల, రంగంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రావెల్ మైనింగ్ జరుగుతోంది. రామచంద్రపురం మండలంలోని రామాపురం, నిన్నూరు, బాదూరు నుంచి రోజూ వందల ట్రిప్పులు గ్రావెల్‌ను దోచుకెళ్తున్నారు. స్థానిక గ్రామాల్లోని ఇరుకిరుకు రోడ్లపై వేగంగా వాహనాలతో వెళ్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు.
"పగలు, రాత్రి అన్న తేడా ఉండదు. 24 గంటల గ్రావెల్ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. వాటి శబ్దాలతో ఇబ్బందిపడుతున్నాం. పగలంతా పనులకు వెళ్లొచ్చిన మాకు రాత్రి నిద్ర ఉండదు. ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము తోలేది తోలుతాం అంటున్నారు. ఎక్కువగా మాట్లాడితే టిప్పర్లతో తొక్కించి వెళ్తామని బెదిరిస్తారు. ఎక్కడ చూసినా మట్టే కనిపిస్తుంది. అన్నం, నీళ్లు, బట్టల్లో దుమ్ము, దూళితో నరకం చూస్తున్నాం. మా ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఎలా బతకాలి." -చెంచు లక్ష్మి కాలనీ వాసులు
gravel mafia: గుండుడి కనుమ చెరువు సమీపంలో మట్టిని తరలిస్తూ రాత్రి 2 విద్యుత్ స్తంభాలను వైకాపా నాయకుల టిప్పర్ ఢీ కొట్టింది. హై పవర్ లైన్ రోడ్డుకు అడ్డంగా పడి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ఆగ్రహానికి గురైన చెంచులక్ష్మి కాలనీ వాసులు టిప్పర్‌లను అడ్డుకున్నారు. వాటి టైర్లలో గాలి తీశారు. తమ గ్రామాల వైపు రావొద్దంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆ టిప్పర్ యజమానైన స్థానిక వైకాపా నాయకుడు తమను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని.. స్థానికులు భంయాందోళన చెందుతున్నారు.