అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌లో వేరుసెనగ పంటతో పాటు ఇతర అంతర పంటలు సాగు చేస్తారు. పప్పుధాన్యాలతో పాటు చిరుధన్యాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా పంటల విత్తనాలను జిల్లాకు 7,672 క్వింటాళ్లు కేటాయించారు. అందులో పప్పుధాన్యాల్లో ప్రధానంగా కంది 4,500 క్వింటాళ్లు, ఉద్దులు 112 క్వింటాళ్లు, పెసర 1,255 క్వింటాళ్లు కేటాయించారు. అదే చిరుధాన్యాలు కింద రాగి 425 క్వింటాళ్లు, కొర్రలు 500, ఊదలు 13, అరికెలు 15, సామలు 10 క్వింటాళ్లు అండుకొర్రలు 20 క్వింటాళ్లు కేటాయించారు. ఈ విత్తనాల సేకరణ, పంపిణీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించారు. అయితే ఇప్పటికీ విత్తన రాయితీ ధరలు ఖరారు కాలేదు. అయినా కొన్ని రకాల విత్తనాలను ఆ సంస్థ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
50 శాతం రాయితీతో పచ్చిరొట్ట
వరి సాగు చేసుకునే రైతులకు పచ్చిరొట్ట ఎరువులను వ్యవసాయశాఖ పంపిణీ చేయనుంది. జిల్లాలోని 25 మండలాలకు విత్తనం కేటాయించారు. ఆయా రకాల విత్తనాలకు 50 శాతం రాయితీని ప్రకటించారు. అందులో జీలుగ 700 క్వింటాళ్లు, జనుము 100, పిల్లిపెసర 50 క్వింటాళ్లు కేటాయించారు. జీలుగ క్వింటాలు పూర్తిధర రూ.5,800, రాయితీ రూ.2,900, రైతువాటా 2,900, జనుము పూర్తి ధర రూ.7,500, రాయితీ ధర రూ.3,750, రైతు వాటా రూ.3,750, పిల్లిపెసర పూర్తి ధర రూ.8,500 రాయితీ ధర రూ.4,250, రైతువాటా రూ.4,250 సొమ్ము చెల్లించాలి. కావాల్సిన రైతులకు పంపిణీ చేస్తారు.
సాధారణ కంది లేనట్లే!