వచ్చిపోయే భక్తులతో... ఇసుకేస్తే రాలనంతగా తిరుపతి బస్టాండ్ కళకళాడుతుండేది. ఆ ప్రాంగణంలో ఉండే 175 మంది దుకాణదారులు... ఆ సందడి ఆధారంగానే జీవనం సాగించేవారు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. దాదాపు రెండున్నర నెలలు బస్టాండ్ మూతపడటంతో... వారి ఆదాయానికి గండిపడింది. ఆంక్షల సడలింపుల తర్వాత కూడా వ్యాపారాల్లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని... వెంటనే అద్దెలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు ఆదేశించటంతో లబోదిబోమంటున్నారు.
జీతాలే ఇవ్వలేని దుస్థితి...
తిరుపతిలోని శ్రీనివాసం, శ్రీహరి, ఏడుకొండలు బస్టాండ్‌లో ఉన్న 175 దుకాణాల వద్ద కనిష్ఠంగా 15వేల నుంచి గరిష్ఠంగా రెండున్నర లక్షల అద్దెను ఆర్టీసీ వసూలు చేస్తుంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కూడా బస్సు సర్వీసులు, యాత్రికుల రాకపోకలు పెద్ద ఎత్తున లేవని.... రోజుకు 2వేలు సంపాదించడమే గగనమైపోతోందని దుకాణదారులు వాపోతున్నారు. పనివారికి జీతాలివ్వడానికే కష్టపడుతున్న తరుణంలో అద్దె చెల్లించాలనడం సమంజసం కాదంటున్నారు.