తిరుమల శ్రీవారి తోబుట్టువుగా..... తిరుపతి గ్రామ దేవతగా పేరుగాంచి తిరుపతి గంగమ్మ జాతర.. కరోనా మహమ్మారి కారణంగా ఆలయానికే పరిమితమైంది. రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన తిరుపతి గంగమ్మ జాతరను మే నెల మొదటి, రెండు వారాల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేవారు. ఈ తొమ్మిది రోజులు భక్తులంతా రోజుకో వేషధారణలో అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకునేవారు.
పాలెగాళ్ల అరాచకాల నుంచి ప్రజలను కాపాడిన దేవతగా కొలిచే గంగమ్మ తల్లిని జాతర సమయంలో దర్శించుకునేందుకు... కేవలం చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చేవారు. కరోనా మహమ్మారి కారణంగా జాతర వైభవాన్ని తొలిసారిగా తిరునగరి చూడలేకపోయింది. అమ్మవారి జన్మదినం రోజున... చరిత్రలో మొదటి సారి ఆలయం భక్తులు లేరు.